రామ్‌నాథ్ కోవింద్.. ఈ దేశపు అత్యున్నత సింహాసనం మీదినుంచి దిగిపోతున్నారు. రాష్ట్రపతిగా సేవలందించిన ఆయన.. పదవీకాలం ముగియడంతో.. పార్లమెంటు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా.. కోవింద్ తన ప్రసంగంలో పార్లమెంటు సభ్యులకు ఓ గొప్ప సందేశం అందించారు.
అయితే ఆయన సందేశం.. యథాలాపంగా జరిగిపోయినదేనా? లేదా, అత్యున్నత పదవి నుంచి దిగిపోతూ.. ఆత్మసాక్షిగా, తన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమా? అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. ఆయన ప్రసంగం అంతరంగాన్ని ఆవిష్కరించినదే అయితే గనుక.. ఆయన మాటలు ప్రభుత్వంలోని పెద్దలకు చురకలు అంటించే ఉద్దేశంతో చెప్పినవా? అనే అనుమానమూ ఏర్పడుతోంది.
‘జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని’ కోవింద్ పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి అన్నారు. ప్రజలు, పార్టీలు కూడా గాంధేయ మార్గాన్ని అనుసరించాలని ఆయన అభిలషించారు.
‘విభజన రాజకీయాలు’ అనే మాట భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్రపతి నోటినుంచి రావడం ఆశ్చర్యకరమే. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ పుట్టుక, మనుగడ, ఔద్ధత్యం, అధికార వైభవం, భవిష్యత్తు ఆశలు అన్నీ కూడా కేవలం విభజన రాజకీయాల మీదనే ఆధారపడి ఉన్నాయి. దేశాన్ని మతం ప్రాతిపదికగా రెండుగా చీల్చడం ద్వారానే.. తమ అధికార వైభవాన్ని సుస్థిరంగా, శాశ్వతంగా కాపాడుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ప్రబలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో.. పదవి దిగిపోతున్న సమయంలో.. రామ్‌నాధ్ కోవింద్.. ప్రభుత్వానికి చురుకు పుట్టించేలాగా.. విభజన రాజకీయాల దౌష్ట్యానికి పాల్పడుతున్న బీజేపీ పెద్దలకు చురకలు అంటించేలాగా.. ఈ మాటలు అన్నారా అనే అభిప్రాయమూకలుగుతోంది.
రామ్‌నాధ్ కోవింద్.. రాజ్యాంగపరమైన అత్యున్నత పదవిలోని వ్యక్తి. కానీ.. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత వీర విధేయుడైన, ఆయన పట్ల వినయసంపన్నుడైన రాష్ట్రపతిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. తన హోదా ఎంతగా రాజ్యాంగ బద్ధమైనదో, తాను అంతగా మోడీ బద్ధుడిగా ఉండిపోయారు.
విభజన రాజకీయాలకు పరాకాష్ట అనదగిన అనేకానేక విషయాలు.. ఆయన రాష్ట్రపతిగా పదవిలో ఉన్న రోజుల్లో జరిగాయి. అవన్నీ కూడా.. చాలా స్పష్టంగా బిజెపివైపు వేలెత్తి చూపించే వ్యవహారాలు! కానీ, విభజన రాజకీయాల పుణ్యమా అని దేశంలో కొన్ని వర్గాలు, కొన్ని కోట్ల మంది ప్రజలు.. సాధారణ జీవనం పట్ల కూడా విసుగెత్తిపోయిన సందర్భాలున్నాయి.
నిత్యం భయవిహ్వలులై బిక్కుబిక్కుమంటూ మనుగడ సాగించిన సందర్భాలున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన వాతావరణం ప్రబలంగా ఉన్న ఏ రోజున కూడా.. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పెదవి విప్పలేదు. తీరా ఇప్పుడు పదవినుంచి దిగిపోతున్న సమయంలో.. ఆయన విభజన రాజకీయాలను ప్రస్తావిస్తున్నారు. నిమ్నవర్గాలనుంచి వచ్చిన కోవింద్.. ఇన్నాళ్లకైనా విధేయత ఉక్కుతొడుగును బద్ధలు చేసుకుని బయటకు వచ్చి ఈ విభజన రాజకీయాల ప్రస్తావన తెస్తున్నారా అనిపిస్తోంది.
సాధారణంగా రాష్ట్రపతి ప్రసంగాలను ప్రభుత్వమే తయారుచేస్తుంది. వీడ్కోలు సమావేశంలో ప్రసంగం తయారుచేసినదో, సహజంగా వచ్చేసినదో మనకు తెలియదు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతిగా చేసే చివరి ప్రసంగాన్ని మరింత జాగ్రత్తగా రూపొందిస్తారేమో చూడాలి.