సర్పంచ్ మొదలుకుని ప్రధాని వరకూ… ఎవరైనా ప్రజలు ఆదరిస్తేనే నాయకులవుతారు. లేదంటే లేదు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే దేవుళ్లనేది. సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని అయిపోయాం కదా, ఇక ప్రజలతో ఏం పని అని అనుకుని, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడుచుకున్నారో…. ఇక భవిష్యత్ వుండదు. ఎందుకంటే ఐదేళ్లకోసారి ప్రజాక్షేత్రంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వుంటుంది.
ఈ నేపథ్యంలో కడపలో చెత్తపన్నుపై ప్రజావ్యతిరేకత గురించి తెలుసుకుందాం. కడప అంటే వైఎస్సార్ కుటుంబ అడ్డా అని అంటారు. అలాంటి కడపలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఎదురు తిరిగారు. కడప కార్పొరేషన్‌లో క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చెత్తపన్ను వసూళ్లు చేయడాన్ని ఆ నగర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెత్త పన్ను వసూళ్లకు వెళ్లిన సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం చేసి, వారిని వెనక్కి పంపారు. ఈ సంగతి తెలిసి కడప కార్పొరేటర్లు అవాక్కయ్యారు.
వీరంతా వైఎస్సార్‌సీపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చెత్తపన్ను వసూళ్లపై ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కార్పొరేటర్లు ప్రయత్నించారు. వెంటనే మేయర్ సురేష్‌బాబు దగ్గరికి పరుగు పెట్టారు. ప్రజల్లో చెత్తపన్నుపై వస్తున్న వ్యతిరేకత గురించి వివరించారు. చెత్తపన్ను వసూళ్లను నిలుపుదల చేయాలని మేయర్‌కు విన్నవించారు. చెత్తపన్ను వసూళ్లకు సంబంధించి ఏవైనా మార్పులు చేసిన తర్వాతే క్లాప్ పథకాన్ని అమలు చేయాలని మేయర్‌కు విన్నవించారు.
చెత్తపన్ను వసూళ్లపై ప్రజావ్యతిరేకత చూడ్డానికి చిన్న విషయంగానే కనిపించొచ్చు. కానీ కడప తమ పార్టీ అడ్డా అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పంతానికి పోయి, క్లాప్ పథకాన్ని బలవంతంగానైనా అమలు చేయాలని పట్టుపట్టలేదు. ఎందుకంటే ప్రజలు ఆరదించడం వల్లే జగన్ సీఎం అయ్యారనే స్పృహ ఇంకా వైసీపీలో ఉన్నట్టు …కడప కార్పొరేటర్ల భయమే చెబుతోంది. తమ ప్రభుత్వ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారా? అని ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు.
మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమంగా ప్రజల నిర్ణయమే శిరోధార్యమని గ్రహించడాన్ని మెచ్చుకోవాలి. ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచించాలని మేయర్‌కు సొంత పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం ఆసక్తికర పరిణామం. ప్రజల దెబ్బ అంటే అలా వుంటుంది మరి. ప్రజల తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఈ చిన్న అంశమే చాలు.