ప్రజాస్వామ్యం తియ్యగానే ఉంటుంది. కానీ ఎక్కువైతే తీపి మధుమేహానికి దారితీసినట్టు, ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛ కూడా ఎక్కువయ్యే కొద్దీ దేశం షుగర్ వ్యాధిగ్రస్తమవుతుంది.
దేశం గురించి పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మితిమీరిన వాక్స్వాతంత్ర్యం వెగటు పుట్టేస్తోంది. సామాన్యుడి నుంచి రాజకీయ నయకుల వరకు బాధ్యత వదిలి మాట్లాడడం పెరిగిపోయింది. ఇంత దుస్థితి మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో లేదు.
పేరుకే ప్రజాస్వామ్యం. కానీ తెదేపా రాకుమారుడు లోకేష్ మాట్లాడేవన్నీ తన మామయ్య బాలకృష్ణ సీమ సినిమాల్లోని డైలాగుల్ని తలపిస్తున్నాయి.
రెడ్ బుక్ పెట్టుకున్నాడట…అందులో తాను పదవిలోకొచ్చాక ఎవరెవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలో రాసుకుంటున్నాడట. ఆఖరికి చిత్తూర్ ఎస్పీ రిషాంత్ రెడ్డి పేరుని కూడా అందులో రాసుకున్నానని పబ్లిక్ గానే ఆ ఎస్పీకి వార్ణింగ్ ఇచ్చి మరీ చెప్పాడు. ఇది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ప్రజలు పదవిచ్చేది దేనికి? ఇలా గుర్తు పెట్టుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడానికా? ఎంత అమాకత్వముంటే ఇలా పబ్లిక్ గా చెప్తాడు?
మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా అంతే. “తాట తీస్తాను కొడకల్లారా” అంటూ బరితెగించి మాట్లాడతాడు. ఎక్కడా అధారాల్లేని అభియోగాలు వేసి విలేజ్ వలంటీర్స్ కి సెక్స్ రాకెట్ అంటగట్టాడు. ఇంతకంటే దగుల్బాజీ తనముంటుందా!
మరో పక్క చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. పుంగనూర్ సంఘటన ఒక్కటి చాలు .. మితి మీరిన స్వేచ్ఛతో ప్రజాస్వామ్యం ఎలా పరిహాసం పాలయ్యిందో చెప్పడానికి. పోలీసుల మీద దాడులు, పోలీస్ వాహనాలు ధ్వంసం..ఏమిటి ఇదంతా! తెదేపా అంటే అరాచకమే అన్నట్టుగా పుంగనూర్ సంఘటన కళ్ల ముందు మెదులుతోంది.
సినిమాల్లో హీరోలు విలన్స్ మీద పంచ్ డైలాగులు కొట్టినట్టు బయట రాజకీయ నాయకులు కొడుతున్నారు. ఆ డైలాగులకి ఈలలేసే మాస్ జనం ఈ రాజకీయ పంచులకి కూడా చప్పట్లు కొడ్తున్నారని ఇంకా రెచ్చిపోతున్నారు. సినిమాలు చూసే జనం అధికంగా యువకులే. సమాజంలో కూడా యువకుల జనాభాయే ఎక్కువ. అందుకే సినిమావాళ్లలాగ, రాజకీయ నాయకులు కూడా వాళ్లే టార్గెట్ ఆడియన్స్ అనుకుంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఛాలెంజులు, వార్ణింగులు…ఇవే సరిపోతున్నాయి. కానీ ఇది కాదు కదా సమాజాన్ని నిలబెట్టేది.
ఒకప్పుడు మంత్రులంటే హుందాతనం ఉండేది, ఎమ్మెల్యే అంటే ఒక మర్యాద ఉండేది. 1990ల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో కామెడీ నటులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కనిపించేవారు. సినిమాల్లోనే అలాంటి పాత్రలు కనపడేవి తప్ప బయట హుందాగా ఉండే రాజకీయ నాయకులే ఉండేవాళ్లు. ఇప్పుడు మాత్రం బయట అలా కామెడీ చేస్తూ కమెడియన్స్ ని తలపిస్తున్న రాజకీయప్రతినిధులు చాలా మందే ఉన్నారు.
ప్రతిదీ వినోదమేనా! ఇటు జనంలోనూ, అటు నాయకుల్లోనూ సీరియస్నెస్ ఉండదా! పాలన మీద కాకుండా వ్యక్తిగత అభియోగాలు, శీలంపై నిందలు, అసభ్య పదాలతో దాడులేనా!
అందుకే అనిపిస్తుంటుంది. ప్రజాస్వామ్యంలో మరీ ఇంత స్వేచ్ఛ పనికిరాదని. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉండే యువజనాభా ఎక్కువున్న మన దేశంలో స్వేచ్ఛని నియంత్రించాల్సిన అవసరముంది. అందునా, సోషల్ మీడియా యుగంలో ప్రతి వ్యక్తి ఒక మీడియా సంస్థలా మారిపోయిన ఈ రోజుల్లో ఈ గందరగోళాన్ని, అశాంతిని కంట్రోల్ చేసే దిశగా ప్రభుతం పని చెయ్యాలి. దీనిపై చట్టాలు తేవాలి.
లేకపోతే ఎవడికి తోచించి వాడు మాట్లాడడం…అప్రజాస్వామిక వాతావరణానికి తెరలేపడం అన్నట్టుంటుంది.
చంద్రబాబు వయసువాడు ఎలా ఉన్నా భరించొచ్చు. కానీ భవిష్యత్తు నాయకుడు కావాల్సిన యువకుడైన లోకేష్ తన తండ్రికంటే హీనంగా ప్రవర్తించడం సమాజానికి ప్రమాదకరం. అతని వార్ణింగులు, హిట్ లిష్టులు ఒక రకంగా హింసని, టెర్రరిజాన్ని ప్రోత్సహించడం లాంటిదే!
ఇక్కడ లోకేష్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటుంది. రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసాడు.కానీ అదే పనిగా మోదీని తిడుతూ నడవలేదు, ఎవ్వరికీ వార్ణింగులివ్వలేదు, హిట్ లిష్టులు బయటపెట్టలేదు. అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్రలో చంద్రబాబుని తిట్టడమొక్కటే పెట్టుకోలేదు, వార్ణింగులివ్వలేదు. తన బ్లూబుక్కు ఏదో మనసులో పెట్టుకుని ఎక్కడికక్కడ జనానికి ఏం కావాలో, ఎక్కడ ఏ ప్రాజెక్టు తేవాలో, ఎవరికి ఏ కష్టం తీర్చాలో రాసుకుని ముందుకెళ్లాడు. లక్ష్యం ఉన్న నాయకుడు పనిచెయ్యాల్సిన పద్ధతి అది. గెలుపోటములు తర్వాతి విషయం.
“హిట్ లిష్టు” ఒకప్పుడు ఎర్రజెండా పట్టుకున్న నక్సల్స్ రాసుకునేవారు. ఇప్పుడా పని పసుపు జెండా పట్టుకుని ఎర్రబుక్కు పెట్టుకుని లోకేష్ కానిస్తున్నాడు!
హరగోపాల్ సూరపనేని