మహేష్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. జోష్ ను రెట్టింపు చేస్తూ, మధ్యాహ్నం మరో పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. అయితే అంతలోనే ఆ పోస్టర్ మాయమైంది. ఆ స్థానంలో మరో పోస్టర్ వచ్చింది.
మధ్యాహ్నం రిలీజ్ చేసిన పోస్టర్, ఆ తర్వాత మినిమం గ్యాప్ లో వదిలిన పోస్టర్ రెండూ ఒకటే. కొత్తదనం ఏం లేదు. కాకపోతే అందులో ఓ పేరు మాత్రం మారింది. దాని కోసమే ఇలా మరో పోస్టర్ ను రిలీజ్ చేయాల్సి వచ్చింది.
సినిమా కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ డ్రాప్ అయ్యారు. ఈ సినిమాతో అతడికి ఎలాంటి సంబంధం లేదు. కానీ రిలీజ్ చేసిన పోస్టర్ లో అతడి పేరు కనిపించింది. దీంతో అతడి పేరును తొలిగించి, మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గుంటూరు కారం సినిమా. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాంగ్ రిలీజ్ చేద్దామనుకున్నారు. తమన్ తో దగ్గరుండి 2 ట్యూన్స్ కూడా రెడీ చేయించాడు త్రివిక్రమ్. కానీ వాటిలో దేనికీ మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సాంగ్ పక్కనపెట్టి, పోస్టర్లతో సరిపెట్టారు.
ఈ సినిమా నుంచి తమన్ ను తప్పించినట్టు గతంలో వార్తలొచ్చాయి. అప్పట్లోనే యూనిట్ వాటిని ఖండించింది. అయినప్పటికీ ఇంకా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో తమన్ పేరు కనిపించింది. దీంతో ఊహాగానాలకు దాదాపు చెక్ పడినట్టయింది.
మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచి పూజాహెగ్డే తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు సెకెండ్ లీడ్ గా చేసిన శ్రీలీలను, మెయిన్ హీరోయిన్ గా మార్చేశారు. సెకెండ్ హీరోయిన్ గా మీనాక్షి దీక్షిత్ ను తీసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న గుంటూరుకారం సినిమా థియేటర్లలోకి రాబోతోంది.