ఆ పాత జ్ఞాపకాలు.. టాలీవుడ్ లో మళ్లీ రిపీట్

ఇప్పుడంతా ఫటాఫట్, ధనాధన్. టికెట్ రేట్లు పెంచుకున్నామా, సినిమా రిలీజ్ చేశామా, ఫస్ట్ వీకెండ్ నాటికి మ్యాగ్జిమమ్ దండుకున్నామా.. ఇదే తంతు నడుస్తోంది. హిట్ టాక్ వస్తే మరో వారం అదనం, అదో పెద్ద…

ఇప్పుడంతా ఫటాఫట్, ధనాధన్. టికెట్ రేట్లు పెంచుకున్నామా, సినిమా రిలీజ్ చేశామా, ఫస్ట్ వీకెండ్ నాటికి మ్యాగ్జిమమ్ దండుకున్నామా.. ఇదే తంతు నడుస్తోంది. హిట్ టాక్ వస్తే మరో వారం అదనం, అదో పెద్ద బోనస్ అన్నట్టు మారింది పరిస్థితి. ఇక సినిమా రిజల్ట్ విషయానికొస్తే, మొదటి రోజు మొదటి ఆటకే ఫలితం తేలిపోతోంది.

ఇలా మారిన పరిస్థితుల నేపథ్యంలో వంద రోజుల వేడుకలు, సిల్వర్ జూబ్లీ పండగలు కనుమరుగయ్యాయి. అవన్నీ టాలీవుడ్ చరిత్ర పుటల్లో చేరిపోయాయని, అలనాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటారు సినీ విశ్లేషకులు. కానీ పండగ ఇంకా మిగిలే ఉంది. ఈ తరానికి కూడా వంద రోజుల పండగల్ని పరిచయం చేస్తున్నాయి కొన్ని సినిమాలు.

మొన్నటికిమొన్న వాల్తేరు వీరయ్య 200 రోజుల పండగ చేశారు. సినిమా యూనిట్ అందరికీ షీల్డులు అందించారు. చరిత్ర తిరగరాసినట్టుగా అనిపిస్తోందంటూ చిరంజీవి స్పందించారంటే.. ఈ వేడుక అందర్లో ఎంత ఉత్సాహాన్ని నింపిందో అర్థం చేసుకోవచ్చు.

అంతకంటే ముందు వీరసింహారెడ్డి 100 రోజుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమం కూడా అత్యంత అట్టహాసంగా జరిగింది. యూనిట్ సభ్యులతో పాటు, పలువురు డిస్ట్రిబ్యూటర్లకు షీల్టులు ఇచ్చారు. ఆ సందర్భంగా బాలకృష్ణ కూడా తన జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఇక వంద రోజుల పండగలు కనిపించవేమో అనుకొని బాధపడ్డానని, అలాంటిది తన సినిమాతోనే ఆ పండగ మళ్లీ షురూ అవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ స్పందించారు.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు మాత్రమే కాదు.. రీసెంట్ గా నాని కూడా వంద రోజుల వేడుక చేశాడు. తను నటించిన దసరా సినిమా దిగ్విజయంగా వంద రోజులు పూర్తిచేసుకుందంటూ.. షీల్డ్ అందిస్తున్న ఫొటోలు షేర్ చేశాడు. మరోసారి దసరా రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

ఇవన్నీ చూస్తుంటే, టాలీవుడ్ లో వంద రోజుల పండగ ట్రెండ్ మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. ఒకప్పట్లా సినిమా వంద రోజులు ఆడినా, ఆడకపోయినా ఫంక్షన్ మస్ట్ అంటారేమో. ఇన్నాళ్లూ కలెక్షన్ల గురించే మాట్లాడుకుంటున్న జనం, గతంలోలా ఎన్ని సెంటర్లలో సినిమా ఆడిందో కూడా చర్చించుకుంటారేమో.