అందుకు బాధ‌ప‌డ‌లేదంటున్న‌ ఎన్వీ ర‌మ‌ణ‌

మ‌రో నెల రోజుల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏం కావాల‌ని అనుకున్నారు, చివ‌రికి ఏమ‌య్యారో మ‌న‌సులో మాట‌ను ఆయ‌న…

మ‌రో నెల రోజుల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏం కావాల‌ని అనుకున్నారు, చివ‌రికి ఏమ‌య్యారో మ‌న‌సులో మాట‌ను ఆయ‌న బ‌య‌ట పెట్టారు. ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాపై ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాంచీలో శ‌నివారం ఆయ‌న ఉప‌న్య‌సించారు.  

న్యాయం అందించడం అంత సులువైన‌ బాధ్యత కాదన్నారు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంద‌న్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పూర్తిగా వ‌న్‌సైడ్ ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఆయ‌న‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీడియా పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయన్నారు. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయన్నారు. బాధ్య‌త‌ను మీడియా విస్మ‌రిస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని రెండ‌డుగులు వెన‌క్కి తీసుకెళ్తున్నార‌న్నారు.  

అయితే ప్రింట్ మీడియా ఇప్ప‌టికీ ఎంతోకొంత బాధ్య‌త‌గా ప‌ని చేస్తోంద‌ని ప్ర‌శంసించారు. ఎల‌క్ట్రానిక్ మీడియాలో జ‌వాబుదారీత‌నం లేద‌న్నారు. సోష‌ల్ మీడియాలో అయితే దుర్మార్గ‌మ‌న్నారు.  

మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే అన్నిటికి ప‌రిష్కార‌మ‌న్నారు. స‌మాజానికి వాస్త‌వాలు చెప్ప‌డంలో న్యాయ మూర్తులు గుడ్డిగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని సూచించారు. స‌మాజ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని నిజం చెప్ప‌డానికి సిద్ధంగా ఉండాల‌ని కోరారు. తాను రాజ‌కీయాల్లో చేరాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు.

అయితే విధి మ‌రో మారి చూపింద‌న్నారు. న్యాయ‌మూర్తి అయినందుకు బాధ‌ప‌డ‌డం లేద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చెప్పుకొచ్చారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 ఆగస్టు 26వరకు ఆయన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా సేవలు అందించనున్నారు.

సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా అత్య‌ధిక కాలం 16 నెల‌ల పాటు ప‌ని చేసిన ఘ‌న‌త జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ద‌క్క‌నుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పుస్త‌క ర‌చ‌న చేస్తాన‌ని ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.