సాగినంత కాలం తమంత వారు లేరందురు అన్నది వెనకటికి పాట. నిర్మాత దిల్ రాజుకు కాలం కలిసి వచ్చి మంచి సినిమాలు పడ్డాయి.
బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో, శతమానం భవతి ఇలాంటి సినిమాలు అతని జడ్జ్ మెంట్ కు అద్దం పట్టాయి. అక్కడి నుంచి దిల్ రాజు జడ్జ్ మెంట్ మీద అంచనాలు పెరిగిపోయాయి.
కానీ శతమానం భవతి తరువాత శ్రీనివాసకళ్యాణం దారుణంగా దెబ్బతీసింది. ఇలాంటి అలాంటి డిజాస్టర్ కాదు. ఆ తరువాత మళ్లీ దిల్ రాజు ఎంతో ఎగ్జయిట్ అయిపోయి ఆశలు పెట్టుకున్న సినిమా జాను. తమిళ సినిమా 96 చూసి, అక్కడిక్కడ థియేటర్ లో డెసిషన్ తీసుకుని, రీమేక్ చేసారు. అక్కడి టీమ్ నే హైర్ చేసుకున్నారు. దాని మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. మంచి కాంబినేషన్ సెట్ చేసారు. కానీ ఏమయింది. ఫలితం దారుణం.
ఇప్పుడు లేటెస్ట్ గా థాంక్యూ. ఇదీ అంతే. మంచి కాన్సెప్ట్ అని దిల్ రాజు బలంగా నమ్మారు. బలంగా ప్రచారం చేసారు. అన్నింటా తానై వ్యవహరించారు. కానీ ఇక్కడా ఫలితం వికటించింది. దారుణమైన ఓపెనింగ్ వచ్చింది.
ఇక్కడ దిల్ రాజు ఆలోచన తప్పా? లేక నమ్మిన సబ్జెక్ట్ లు తప్పా? లేక జనాల ఆలోచనకు దిల్ రాజు అభిరుచి మాచ్ కావడం లేదా? ఈ విషయం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది.
కొన్ని కొన్నిసార్లు దిల్ రాజు తాను మేధావిని అనుకుంటారు. కొత్త మార్గాలు తొక్కాలనుకుంటారు. కానీ ఆ మార్గాలు సక్సెస్ అయితే అంతా నిజమే అనుకుంటారు…కానీ ఇలా తేడా వస్తేనే అలా చేసి తప్పు చేసాడంటారు.
మొత్తానికి ఇక ప్రొడక్షన్ విషయంలో దిల్ రాజు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సబ్జెక్ట్ లు ఎంచుకోవాలేమో?