బాలు లేని లోటు మరోసారి తెలిసొచ్చిందా..?

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు తీర్చలేనిది. ఇదేదో ఇండస్ట్రీ కామన్ గా ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. నిజంగానే ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికప్పుడు ఆ విషయం ప్రూవ్ అవుతూనే ఉంది.…

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు తీర్చలేనిది. ఇదేదో ఇండస్ట్రీ కామన్ గా ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. నిజంగానే ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికప్పుడు ఆ విషయం ప్రూవ్ అవుతూనే ఉంది. తాజాగా అలాంటిదే మరో సందర్భం టాలీవుడ్ కు ఎదురైంది.

సన్నాఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నారు మోహన్ బాబు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను ఈరోజు రిలీజ్ చేశారు. ఆ పాట విన్న వెంటనే అంతా ముక్తకంఠంతో అన్నమాట ఒక్కటే. బాలు లేని లోటు కనిపించిందని. నిజమే.. సంస్కృత, గ్రాంధిక పదాలతో నిండిన ఈ రసరమ్యమైన పాటను బాలు మాత్రమే పాడాలి. ఒకవేళ వేరే గాయకుడు పాడినా బాలు పాడినంత అందం రాదు.

సన్నాఫ్ ఇండియా పాట విషయంలో అదే జరిగింది. రాహుల్ నంబియార్ ఈ పాటను ఆలపించాడు. అతడి ప్రయత్నాన్ని తప్పుబట్టలేం. చక్కగా పాడాడు. వంద శాతం కష్టపడ్డాడనడంలో సందేహం లేదు. కానీ ఏదో లోటు, ఇంకేదో వెలితి. అదే బాలు వాయిస్.

దశాబ్దాలుగా ఇలాంటి పాటల్ని బాలు గొంతుతో విని అలవాటైపోయింది. ఇప్పుడు మరో గొంతుక ఈ తరహా పాటల్లో వినిపిస్తే మానసికంగా జీర్ణించుకోవడం కష్టం అవుతుంది. అంతేతప్ప, ఈ పాటను పాడిన గాయకుడ్ని కించపరచడానికేం లేదు.

కేవలం ఈ ఒక్క పాట సందర్భంలోనే కాదు.. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పాటలొస్తాయి. అప్పుడు కూడా మనకు బాలు గుర్తురావడం గ్యారెంటీ. ఆయన లోటు అలా కళ్లముందు కనిపిస్తుందంతే. మనమేం చేయలేం. బాధపడడం తప్ప. ఇక ఈ పాటను కంపోజ్ చేసినప్పుడు మ్యాస్ట్రో ఇళయరాజా.. ఆ గానగంధర్వుడ్ని ఎన్నిసార్లు తలచుకున్నారో..!