టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న జగన్ సర్కార్‌కు కరోనా సహకరిస్తుందా? అనేది ప్రశ్నగా మిగిలింది. కరోనా సెకెండ్ వేవ్ ఉధృతిని పరిగణలోకి తీసుకున్న పలు రాష్ట్రాలు ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి.
తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ టెన్త్, ఇంటర్ పరీక్షల విషయమై పెద్దగా చర్చకు ఆస్కారం లేకుండానే రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక వైపు కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడంతో సహజంగానే ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలను రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఆయన పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. లోకేశ్ డిమాండ్‌తో జగన్ సర్కార్ మరింత పంతాలు, పట్టింపులకు పోయింది. ఆరు నూరైనా, నూరు ఆరైనా టెన్త్, ఇంటర్ పరీక్షలను జరిపి తీరుతామని జగన్ సర్కార్ ప్రతిజ్ఞ చేసింది.
ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పడుతోందని, జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఆలోచిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు జూలై 7 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్, జూలై 26 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థులు, అలాగే 6.40 లక్షల మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఇదే తగ్గుదల కొనసాగితే మాత్రం పరీక్షల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్టే.
జగన్ సర్కార్ పంతం నెగ్గాలంటే అంతా కరోనా మహమ్మారి చేతుల్లోనే ఉంది. రాజకీయ పార్టీల అవకాశవాదం ఎలాగున్నా… విద్యార్థులు సురక్షితంగా పరీక్షలు రాయడం కంటే కావాల్సిందేముంది? అంతా మంచే జరగాలని ఆకాంక్షిద్దాం.