డ్రగ్స్ వాడుతూ దొరికిన టాలీవుడ్ హీరోయిన్

సినీపరిశ్రమకు, డ్రగ్స్ కు తెరవెనక సంబంధాలున్నాయనే ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఎప్పటికప్పుడు ఘటనలు జరుగుతూనే ఉంటాయి. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు, హీరోయిన్ల విచారణ ఎపిసోడ్లు చూశాం. కన్నడనాట కూడా…

సినీపరిశ్రమకు, డ్రగ్స్ కు తెరవెనక సంబంధాలున్నాయనే ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఎప్పటికప్పుడు ఘటనలు జరుగుతూనే ఉంటాయి. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు, హీరోయిన్ల విచారణ ఎపిసోడ్లు చూశాం. కన్నడనాట కూడా డ్రగ్స్ కేసు సినీప్రముఖుల చుట్టూరా తిరిగింది. ఇప్పుడు మరో హీరోయిన్ డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయింది.

తెలుగులో ఆది సాయికుమార్ చేసిన బుర్రకథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన నైరా షా.. డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయింది. ముంబయి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా నైరాషాను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమె బెయిల్ పై రిలీజైంది.

ఇంతకీ ఏం జరిగింది..

ఆదివారం తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నైరా షా. బాయ్ ఫ్రెండ్ ఆషిక్ షాజిద్ హుస్సేన్ తో కలిసి జుహులోని ఓ స్టార్ హోటల్ లో పెద్ద పార్టీ ఇచ్చింది. పార్టీ తర్వాత నైరా, షాజిద్ ఇద్దరూ కలిసి తమ సూట్ రూమ్ కు వెళ్లారు. తమతో పాటు నిషేధిత మాదకద్రవ్యం ఛరస్ (కానబిస్)ను వెంట తీసుకెళ్లారు.

విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న శాంతాక్రూజ్ పోలీసులు వేకువజామున 3 గంటల సమయంలో హోటల్ పై రైడ్ చేశారు. నైరా షా గదిని సోదా చేశారు. నిషేధిత డ్రగ్స్ తో పాటు వాటిని సిగరెట్లలో చుట్టినట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దర్నీ అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన వెంటనే నైరా షాను వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఆ వెంటనే కోర్టులో హాజరుపరచగా స్థానిక కోర్టు నైరాషాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసులు, నైరాషాకు ఎలా డ్రగ్స్ అందాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.