బాగా పాపులరైన వ్యక్తుల్ని, నిస్వార్థ సేవా కార్యక్రమాలతో పేరు సంపాదించుకున్నవారిని తమవైపు తిప్పుకుని, వారి మంచి పేరులో నుంచి ఎంతో కొంత కొట్టేయడం చంద్రబాబుకి బట్టర్ తో పెట్టిన విద్య అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇమేజ్ పెంచుకోడానికి అడ్డదారులుండవు బాబూ.. అంటూ హితవు పలికారు. ఆయుర్వేద వైద్యులు ఆనందయ్యకు చంద్రబాబు వలేస్తే పడలేదని, అందుకే ఇప్పుడు సోనూ సూద్ కి గాలమేశారని చెప్పుకొచ్చారు.
ఇటీవల సోనూ సూద్ ని జూమ్ యాప్ లో తీసుకుని చంద్రబాబు డ్రామాలాడారంటూ మండిపడ్డారు విజయసాయి. సోనూ సూద్ అమాయకంగా బాబు బుట్టలో పడే ప్రమాదముందని, త్వరలోనే బాబు సంగతి వారికి తెలిసిపోతుందని అన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకి తెలుసని అందుకే వ్యూహకర్తల కోసం ఎదురు చూశారని అన్నారు విజయసాయిరెడ్డి. గెలుపు మార్గం చూపించే వారెవరైనా దొరికితే వెయ్యి కోట్లు ఈజీగా వెదజల్లేవారని విమర్శించారు.
” కిందటి ఎన్నికల్లో గెలుపు అసాధ్యమని బాబుకి తెలుసు. విజయం సాధించే మార్గం చూపించే వారెవరైనా దొరికితే వెయ్యి కోట్లయినా వెదజల్లేవాడు. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ స్కామ్ లోనే 5లక్షల కోట్లు వస్తాయని ఆశించాడు. ఈ కథలన్నీ తెలిసి వ్యూహకర్తగా సేవలందించడానికి ఎవరు అంగీకరిస్తారు..?” అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. బాబుసంగతి తెలిసే ఆయనకెవరూ వ్యూహకర్తలు రాలేదని చెప్పారు.
ప్రజలెవరూ తన ట్రాప్ లో పడిపోరని తెలిస్తే.. చంద్రబాబు మనుషుల్ని విభజిస్తారని అన్నారు విజయసాయిరెడ్డి. ఆయన సంగతి తెలిసిన టీడీపీ సీనియర్లు కూడా ఇదే మాట చెబుతారన్నారు. ప్రజల్ని విభజించడం, వారి మనసుల్ని చెడగొట్టే పద్ధతిని ఎప్పటికీ చంద్రబాబు విడిచిపెట్టరని విమర్శించారు.