క‌విత మాట‌ల్లో మ‌ర్మ‌మేంట‌బ్బా…

క‌ల్వ‌కుంట్ల క‌విత‌… తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముద్దుల త‌నయ‌. నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా ఓడిపోయిన త‌ర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. తండ్రి మ‌న‌సెరిగిన టీఆర్ఎస్ ముఖ్య నేత‌. ఆమె ఏం మాట్లాడినా ఏదో ఒక…

క‌ల్వ‌కుంట్ల క‌విత‌… తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముద్దుల త‌నయ‌. నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా ఓడిపోయిన త‌ర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. తండ్రి మ‌న‌సెరిగిన టీఆర్ఎస్ ముఖ్య నేత‌. ఆమె ఏం మాట్లాడినా ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. ఊరికే మాట్లాడ్డం ఆమెకు చేత‌కాదు. తెలంగాణ‌లో భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై క‌విత తాజా వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాజ‌కీయ సమీకరణాలు మారుతాయన్నారు. ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఏది జరిగినా టీఆర్ఎస్‌కే మంచి జరుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అనేక అంశాలు చర్చకు వస్తాయన్నారు. ఇంతకు మించి తానేమీ మాట్లాడనని కవిత అనడం రాజ‌కీయ చ‌ర్చ‌కు దారి తీసింది.

తెలంగాణ అవ‌త‌రించిన త‌ర్వాత …ఇప్ప‌టి వ‌ర‌కూ చోటు చేసుకున్న, భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు తేడా ఉంటుంద‌ని క‌విత న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అన్ని ర‌కాల శ‌క్తియుక్తుల‌ను ప్ర‌యోగిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు హైద‌రాబాద్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాలు బీజేపీకి తెలంగాణ‌లో ఎలాగైనా పాగా వేస్తామ‌నే భ‌రోసా ఇచ్చాయి.

మ‌రోవైపు కాంగ్రెస్ పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డ‌డం కూడా బీజేపీ బ‌లోపేతానికి కార‌ణ‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా దివంగ‌త నేత వైఎస్సార్ త‌న‌య ష‌ర్మిల తెలంగాణ‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈమె ప్ర‌భావం కూడా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంతోకొంత ఉంటుంద‌నే అంచ‌నాలు లేక‌పోలేదు. ముఖ్యంగా రెడ్ల సామాజిక వ‌ర్గం ఓట్ల చీలిక ఏ పార్టీకి లాభం, ఎవ‌రికి న‌ష్టం అనే లెక్క‌లు ఇప్ప‌టి నుంచే వేస్తున్నారు.

వైఎస్ ష‌ర్మిల నువ్వంటే నువ్వు వ‌దిలిన బాణం అని టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటున్నారు. కానీ తాను ఎవ‌రో వ‌దిలిన బాణం కాద‌ని ష‌ర్మిల ప‌దేప‌దే స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీసీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో బీసీల్లో మ‌రింత బ‌ల‌ప‌డ‌తామ‌నే ధీమా బీజేపీలో ఉంది. 

వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రం మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే అది ఎవ‌రికి ప్ర‌యోజ‌న‌కారిగా ఉంటుంద‌నేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దానికి కాలం త‌ప్ప మ‌రెవ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు.