జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తాజా వివాదంపై స్పందించాడు. తన వైపు నుంచి తప్పి జరిగి ఉంటే బేషరతుగా క్షమాపణ చెబుతానని ప్రకటించాడు. ఈ నెల 13న ఈటీవీలో ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాష, యాసను కించపరిచేలా కమెడియన్ హైపర్ ఆది మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది.
ఈ నేపథ్యంలో హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్‌పై ఎల్బీ నగర్ ఏసీపీకి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ జాగృతికి కేసీఆర్ కుమార్తె కల్వకుంట కవిత నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ అనుబంధ విద్యార్థి సంఘం సీరియస్‌గా స్పందించడంతో వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సభ్యులు మీడియా సాక్షిగా హైపర్ ఆదికి ఫోన్ చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరంగా కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హైపర్ ఆది స్పందిస్తూ … తాను కేవలం నటుడిని మాత్రమేనని చెప్పాడు. స్క్రిప్ట్ తాను రాయలేదని చెప్పుకొచ్చాడు. ఆ కార్యక్రమం జరిగే సమయానికి స్టేజి మీద 20 మంది వరకు ఆర్టిస్టులు ఉన్నారన్నాడు. ఎవరి పాట వారు పాడుకుంటున్నారని తెలిపాడు.
స్టేజి మీద ఏం జరుగుతున్నదో అంత మధ్య ఎవరికీ తెలియలేదన్నాడు. కానీ పక్కన బతుకమ్మ అని ఎవరంటున్నారో తనకు తెలియదన్నాడు. గౌరమ్మ అని ఎవరంటున్నారో నాకు తెలియదన్నాడు.
ఒకవేళ తాను అన్నదాంట్లో నిజంగా తప్పుంటే క్షమించాలని అడిగేందుకు ఎలాంటి సమస్య లేదని హైపర్ ఆది తెలిపాడు. ఆ ప్లోలో ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే తెలంగాణ వాళ్లకు బేషరతుగా క్షమాపణ చెబుతానని ఆయన వెల్లడించాడు. క్షమాపణ చెప్పడంలో తప్పేం ఉందని హైపర్ ఆది కాస్త తగ్గి మాట్లాడ్డం గమనార్హం.