రాజమండ్రి ఎంపీ, వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌కు తానేం మాట్లాడుతున్నారో ఏమైనా అర్థమవుతోందా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా ఆయనకు తెలియకపోతే ఎట్లబ్బా. మరీ చిన్నపిల్లోల్లలా, అమాయకంగా డిమాండ్లు చేస్తే… విన్న వాళ్లు నవ్విపోరా? ఇది మొదటి తప్పుగా భరత్‌ను క్షమించాల్సిందేనని సరదా కామెంట్స్ ప్రత్యక్షమవుతున్నాయి.
ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను వైసీపీ చీఫ్‌విప్ మార్గాని భరత్ కలిసి తమ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతను భరత్ నెరవేర్చారు. ఇక నిర్ణయం లోక్‌సభ స్పీకర్ చేతుల్లో ఉంది.
ఈ నేపథ్యంలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజుకు పౌరుషం ఉంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామపై అనర్హత వేటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక్కడే భరత్ అమాయకత్వం బయట పడింది. పౌరుషమే ఉంటే డిమాండ్ చేసే వరకూ రఘురామకృష్ణంరాజు పదవిని అంటిపెట్టుకుని ఉంటారా? అయినా పౌరుషానికి, రఘురామకు ఏంటి సంబంధం? పాండవుల మాటలకు పౌరుషంతో నదిలో నుంచి దుర్యోధనుడు బయటికొచ్చినట్టు… రఘురామ ఏమైనా తమరి డిమాండ్లకు రెచ్చిపోయేంత అమాయకుడా? ఇదేనా ఈ రెండేళ్లలో రఘురామను అర్థం చేసుకుంది? రఘురామను అర్థం చేసుకోవడంలో వైసీపీ అజ్ఞానమే ఆ పార్టీ కొంపముంచింది.
ఈటలంటే మానం, మర్యాద, విలువలు, పౌరుషం, తెగింపు, ఢీ అంటే ఢీ అనే తెగువ అన్నిటికి మించి ప్రజాదరణ కలిగిన నేత. మా పార్టీలో వద్దు అంటే …పార్టీని, పదవిని గబ్బిలంలా పట్టుకుని వేలాడేంత సిగ్గులేని వాడు కాదాయన. ఆత్మగౌరవమే శ్వాసగా బతికే స్వభావం ఆయనది. అలాంటి నాయకుడితో తమరి ఎంపీని పోల్చడం ఏమైనా భావ్యమా భరత్ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
ఈటలపై కోపం ఉంటే మరో రకంగా తీర్చుకోవాలే తప్ప, ఇలా ఎవరితో పడితే వారితో పోల్చి ….గత రెండు మూడు దశాబ్దాలుగా సంపాదించు కున్న ఇమేజ్‌ను తగ్గించడం కాదా? అనే నిలదీతలు దేనికి సంకేతం? ఏది ఏమైనా మార్గాని భరత్ డిమాండ్ ఆయన అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పొచ్చు.