టీడీపీ సంగతి ఇపుడే తెలిసిందా కామ్రేడ్….?

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం చూస్తోంది అన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా బీజేపీతో చేయి గలపాలని టీడీపీ ఆరాటపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ద్రౌపది ముర్మునకు టీడీపీ…

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం చూస్తోంది అన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా బీజేపీతో చేయి గలపాలని టీడీపీ ఆరాటపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ద్రౌపది ముర్మునకు టీడీపీ చివరి నిముషంలో మద్దతు ఇచ్చింది.

ఇది నిజంగా విపక్షాలు ఊహించీ ఊహించని విషయం అనుకోవాలి. బీజేపీకి మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా చంద్రబాబు ఉంటారని బహుశా కామ్రేడ్స్ భావించి వచ్చు. కానీ చంద్రబాబు మాత్రం ద్రౌపది ముర్మునకు మద్దతు ఇచ్చి బీజేపీ వారితో కలసి వేదిక పంచుకున్నారు, ఆటూ ఇటూ నేతలు నవ్వులు చిందించారు.

దాంతో ఇన్నాళ్ళూ టీడీపీకి మిత్రపక్షంగా భావించుకుంటూ వస్తున్న సీపీఐకి ఇపుడు మంట రేగింది అనుకోవాలి. ఆ పార్టీ ఇపుడు వైసీపీతో సమానంగా టీడీపీ మీద నిప్పులు చెరుగుతోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయిన జేవీ సత్యనారాయణమూర్తి అయితే టీడీపీ, వైసీపీ దొందూ దొందే అనేశారు. ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వడమేంటి అని మండిపడ్డారు.

కామ్రేడ్స్ ఆగ్రహం ఇలా ఉన్నా కూడా రేపటి ఎన్నికల వేళ టీడీపీ ఏ కారణం చేత అయినా బీజేపీతో పొత్తు లేకపోతే మళ్లీ సీపీఐ ఆ పార్టీ జట్టు కట్టకుండా ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి ఎన్నోసార్లు బీజేపీతో టీడీపీ కలిసింది, విడిపోయింది.

ఇపుడు మళ్ళీ కలవాలని చూస్తోంది. దాంతో టీడీపీది అవకాశవాద రాజకీయమని తెలుస్తోంది. అయినా కూడా తమ వైపునకు టీడీపీ వస్తే బ్రహ్మాండం, బీజేపీతో కూడితే మాత్రం మహా చెడ్డది అన్నట్లుగా సీపీఐ ద్వంద్వ రాజనీతిని పాటించినంతకాలం ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు జనాలలో విలువ ఉంటుందా అనే అంతా అంటున్నారు.