మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ఓ అనుమానం వెంటాడుతోంది. విజయానికి మాత్రం తాను, ఓటమికైతే తమను బాధ్యుల్ని చేసేలా అధినేత కామెంట్స్ ఉన్నాయనే అభిప్రాయాలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షుడు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం సమావేశం అయ్యారు. జగన్ మాట్టాడుతూ 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలిచి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని ప్రజలకు గుర్తు చేస్తూ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో, అంకితభావంతో, నాణ్యతతో నిర్వహిస్తే క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే అని జగన్ దిశానిర్దేశం చేశారు.
ఇక్కడే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు పలు అనుమానాలొస్తున్నాయి. జనాల దగ్గరికి పోయేది వారు చెప్పింది వినడానికే. నిరుద్యోగులు, రైతులు, చిన్నసన్నకారు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన ప్రజానీకం ఈ మూడేళ్లలో పొందిన లబ్ధి కంటే, పోగొట్టుకున్నదేంటో వివరిస్తున్న పరిస్థితి. ధరల పెరుగుదలతో కుటుంబ పోషణ ఖర్చు ఈ మూడేళ్లలో రెండింతలైన పరిస్థితి.
మరోవైపు ఆదాయం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైన వైనాన్ని ప్రజాప్రతినిధులకు జనం వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రజాదరణకు నోచుకోకపోతే దానికి బాధ్యుల్ని చేయడం ఎంత వరకు సమంజసమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. జగన్ అంచనా తలకిందులైతే అందుకు బాధ్యులు తామే అని హెచ్చరిస్తున్నట్టుగా ఉందంటున్నారు. ఒకవేళ 2024లో అధికారంలోకి రాకపోతే చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేయకపోవడం వల్లే ఇలా జరిగిందనే నింద వేయడానికి జగన్ సిద్ధమయ్యారనే అనుమానాలు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్లో తలెత్తాయి.
కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైనా సంక్షేమ పథకాల అమలు ఆగలేదని, తాను చేయాల్సింది చేశానని, ఇక భారమంతా ఎమ్మెల్యేలపైనే ఉందని పలు సందర్భాల్లో జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో సంక్షేమం తప్పితే అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగలేదనే విమర్శ కొన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శ ఉంది. అన్ని వర్గాలను సంతృప్తిపరిస్తేనే అధికారంలోకి వస్తామని, అలా కాకుండా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఒక్కరి వల్లే అంతా జరిగిపోతుందన్నట్టు వ్యవహారం ఉందనే ఆవేదన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో కూడా ఉంది.
కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి, అలాగే ఉద్యోగుల జీతభత్యాలను సమయానికి ఇవ్వలేకపోతుండడం, నూతన పీఆర్సీపై వ్యతిరేకత, స్కూళ్ల విలీనంపై ఎగిసిపడుతున్న అసంతృప్తి ఇలా ప్రభుత్వ పాలనకు రెండో వైపు కూడా చూసుకోవాల్సి వుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం సంక్షేమ పథకాల కేంద్రంగా జనంలోకి వెళ్లి, మూడేళ్ల పాలనలో ప్రభుత్వం ఎంత సొమ్ము ఇచ్చిందో చెప్పి, మరోసారి ఆశీస్సులు పొందాలని ఆదేశిస్తున్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు.
తాము అనుకున్నట్టే ప్రజలు ఆలోచించరని, కనీస సౌకర్యాలు, నిత్యావసర సరుకుల ధరల పెంపు, ఇతరత్రా జీవన వ్యయం పెరగడంపై ప్రశ్నిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. సంక్షేమం తప్ప మిగిలిన విషయాల్లో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోందని, దాన్ని అధిగమించడంపై విజయం ఆధారపడి వుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాను చేయాల్సిందంతా చేశానని, ఇక గెలుపు బాధ్యత మీదే అంటూ భుజాలపై భారాన్ని మోపడం ఎంత వరకు సమంజసమని వాదన ఇప్పుడిప్పుడే వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తుండడం ఆసక్తికర పరిణామం.
సొదుం రమణ