రివ్యూ: కాంచన 3
రేటింగ్: 2/5
బ్యానర్: సన్ పిక్చర్స్, రాఘవేంద్ర ప్రొడక్షన్స్
తారాగణం: రాఘవ లారెన్స్, కోవై సరళ, వేదిక, దేవదర్శిని, శ్రీమాన్, ఓవియా తదితరులు
కూర్పు: రూబెన్
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెట్రి, సుషీల్ చౌదరి
నిర్మాతలు: కళానిధి మారన్, రాఘవ లారెన్స్
రచన, దర్శకత్వం: రాఘవ లారెన్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 20, 2019
తనని తాను మాస్ హీరోగా ఎలివేట్ చేసుకుంటూనే, ప్రతి దానికీ భయపడే పిరికివాడి పాత్ర పోషిస్తూ తన హీరోయిజంని బ్యాలెన్స్ చేసుకోవడానికి లారెన్స్ 'కాంచన' సిరీస్‌ని వాడుకుంటున్నాడు. ఒక పాటలో తన అభిమానులే తన లోకం అంటూ వారికి రజనీకాంత్ మాదిరిగా ఇంట్రడక్షన్ సాంగ్‌ని పెట్టుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో తన కటౌట్స్‌కి గజమాలలు, పాలాభిషేకాలు చేస్తుంటారు! అంతటితో లారెన్స్ ఆగలేదు. ఇటీవల తెల్లజుట్టుతో కనిపించడం ఫ్యాషన్ అవుతోంది కనుక, రజనీకాంత్, అజిత్ లాంటి వాళ్లు అలా తెల్లజుట్టుతోనే హీరోయిజమ్ పండిస్తున్నారు లారెన్స్ కూడా ఆ గెటప్ వేసేసాడు. మాస్ హీరోలా పంచ్ డైలాగులు చెప్పాలనే సరదాని కాళి పాత్ర ద్వారా తీర్చుకున్నాడు.
కాంచన 3 చూస్తే… లారెన్స్ తనకున్న సరదాలని తీర్చుకోవడానికి ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీని మార్కెటింగ్ గిమ్మిక్గా వాడుకున్నాడనిపిస్తుంది. గతంలో అతను తీసిన 'కాంచన' చిత్రాల్లో నిఖార్సయిన హారర్ సీన్స్ వుండేవి. అలాగే సదరు దెయ్యానికి బలమైన బ్యాక్‌స్టోరీ వుండేది. కాంచనలో శరత్‌కుమార్, కాంచన 2లో నిత్యామీనన్ ఫ్లాష్‌బ్యాక్‌కి చాలా పెద్ద ప్లస్ అయ్యారు. ఈ కాంచన 3 మాత్రం పూర్తిగా లారెన్స్ సేవా కార్యక్రమాలు, సెల్ఫ్ ఎలివేషన్ల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇక కాంచన సిరీస్ అంతగా క్లిక్ అవడానికి కారణమైన హారర్ + కామెడీ లేకపోలేదు. అయితే ఈసారి ఆ పార్ట్‌లో ఎలాంటి ఇన్నోవేషన్ లేదు. గతంలో క్లిక్ అయిన కామెడీ దృశ్యాలనే మరోసారి తెరకెక్కించాడు. నవ్వించడం కోసం నటీనటులని నానా యాతనా పెట్టాడు.
కోవై సరళ, దేవదర్శిని అయితే ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ చేయాలనే షరతుల కారణంగానో ఏమో భరించలేనంత ఓవరాక్షన్ చేసారు. లారెన్స్ కోసం పడి చచ్చిపోయేందుకు ఈసారి ముగ్గురు హీరోయిన్లని పెట్టుకుని వారిని విలువ లేని వస్తువుల మాదిరిగా చిత్రీకరించారు. సదరు అమ్మాయిల తల్లిదండ్రుల పాత్రలతో పాటు హీరో తల్లి పాత్ర కూడా వాళ్లు వున్నది ఒకే పర్పస్ మీద అన్నట్టు ఎంకరేజ్ చేస్తూ కంపరం కలిగిస్తారు. సోకాల్డ్ మాస్ కామెడీ ఒకటీ అరా సన్నివేశాల్లో బాగానే పండినా కానీ నవ్వించడానికి లారెన్స్ అండ్ కో ఎంత దిగజారడానికి అయినా తెగించేసారు. తల్లి, వదిన పాత్రలతో సోకాల్ హీరో తాలూకు కొన్ని సంభాషణలు, సన్నివేశాలు కర్ణ కఠోరంగా, కంటికి అగ్ని పరీక్షలా మారాయి. కాంచన సిరీస్‌లో ఇవన్నీ వుండి తీరాలి అన్నట్టుగా లారెన్స్ అడ్డు, అదుపు లేకుండా రెచ్చిపోయాడు.
సన్నివేశ బలం లేనపుడు మాస్‌ని మెప్పించడానికి సన్నివేశాలని ఎంత లౌడ్‌గా తీస్తే అంత మంచిదని భావిస్తారో ఏమో ఇటీవల వచ్చిన 'వినయ విధేయ రామ' తరహాలో కొన్ని సీన్లు భరించలేనంత లౌడ్‌గా వున్నాయి. ఉదాహరణకి దెయ్యాలని వదిలించే రష్యన్ మాంత్రికుల చేష్టలు, చర్యలు లో బడ్జెట్లో థర్డ్ గ్రేడ్ హారర్ సినిమాలని తలపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఒక్కటీ జెన్యూన్‌గా నవ్వించి, విజువల్‌గా, టెక్నికల్‌గా కూడా స్ట్రయికింగ్‌గా అనిపిస్తుంది. 'కాంచన ఆట మొదలు' అని పడిన ఇంటర్వెల్ కార్డు ద్వితియార్ధంపై ఆశలు రేకెత్తిస్తుంది కానీ అటు తర్వాత జరిగే ఆట పెద్దగా ఎక్సయిట్ చేయదు. లారెన్స్‌ని దెయ్యం పూనడం, అతను స్త్రీలా ప్రవర్తించడం, తన కుటుంబ సభ్యులనే కొట్టడం లాంటివన్నీ ఇంతకుముందు కాంచనలో చూపించినవే.
కోవై సరళ, దేవదర్శినితో పాటు హీరోయిన్లందరినీ వంగోపెట్టి వెనుక బెల్టుతో కొట్టే సన్నివేశం సుదీర్ఘంగా సాగుతూ భావదారిద్య్రానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక అక్కడ్నుంచీ ఫ్లాష్‌బ్యాక్‌కి మారిన తర్వాత లారెన్స్‌ని తెల్లజుట్టుతో చూడాలనే ముచ్చట వున్న అభిమానులకి మినహా మరెవరికీ కాస్తయినా వినోదం దక్కదు. ఇక పతాక సన్నివేశమయితే లారెన్స్ 'డాన్', 'రెబల్', ఇంకా అనేకానేక చిత్రాల్లో వున్న అతినంతా ఒక్కచోట చేర్చే ప్రయత్నంలా అనిపిస్తుంది. కాంచన ఫాన్స్‌కి బోనస్‌గా 'కాంచన 4' కూడా వస్తోందని చెబుతూ ముగింపు కార్డు పడుతుంది.
నటీనటుల్లో ఎవరి గురించి ప్రత్యేకంగా పేరు రాసి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చెక్ తీసుకున్నాం కనుక వాళ్లు చేయమన్నట్టల్లా చేసేసి పోవడమే అన్నట్టు అందరూ అభినయం తలవంచుకునే రీతిన పేట్రేగిపోయారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రాన్ని ఉన్నతంగా తెరకెక్కించాలనే ఆలోచన లేనట్టు, ఇలాంటి సినిమాలు చూసే ఆడియన్స్‌కి ఇంత కంటే చూపించాల్సిన పని లేదన్నట్టుగా కంగాళీగా తీసి పారేసారు. తమన్ మార్కు కాంచనలోని హారర్ మ్యూజికల్ స్కోర్ మినహా ఇందులో చెప్పుకోతగ్గ విశేషాలేమీ లేవు. స్పెషల్ ఎఫెక్ట్స్‌పై కూడా ఎలాంటి ఖర్చు పెట్టలేదు.
ఈ సినిమా కోసం ఎగబడి వస్తోన్న జనాన్ని చూస్తేనే ఈ చిత్రాన్ని లారెన్స్ ఇంత తేలికగా ఎందుకని తీసాడో అర్థమవుతోంది. ఈ సిరీస్ పేరు తగిలిస్తే జనం బారులు తీరిపోతారనేది అతనికి తెలుసు. అందుకే ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు కాస్త కూడా తన సృజనకి శ్రమ పెట్టకుండా ఓ కంగాళీ సినిమాని 'కాంచన 3' అంటూ సేల్ చేసేసాడు. ఇలాంటి నాసి రకం సినిమా ఈసారికి చెల్లిపోవచ్చు కానీ ఇకపై ఈ సిరీస్‌ని కొనసాగించే ఉద్దేశం వుంటే తదుపరి తీసే కాంచనని ఇలాంటి జుగుప్సాకర హాస్యంతో నింపితే త్వరలోనే ఈ ఫ్రాంచైజీ పతనావస్థకి చేరిపోవచ్చు.
బాటమ్ లైన్: కిచిడీ!
– గణేష్ రావూరి