2023లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అస్త్రాన్ని ప్రయోగించాలనే వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికి చెప్పుకోదగ్గ పలుకుబడి ఉంది. కోమటిరెడ్డి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే మరింత బలోపేతం కావచ్చనే ఆలోచనలో బీజేపీ వుంది.
అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మొదట్లో ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆ తర్వాత సర్దుకుపోయినట్టే కనిపిస్తోంది. కానీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పుడప్పుడు తన అసంతృప్తిని బయట పెడుతున్నారు.
మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమిత్‌షాతో 45 నిమిషాలు భేటీ కావడం చర్చకు దారి తీసింది. అమిత్‌షాతో భేటీ వార్తలపై కోమటిరెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ను బీజేపీ ఓడించి తీరుతుందన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ను ఓడించే పార్టీలో చేరుతానని ప్రకటించడం ద్వారా బీజేపీలో జాయిన్ కావడంపై స్పష్టత ఇచ్చినట్టైంది.
బీజేపీలోకి ఆహ్వానించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోమటిరెడ్డిని అమిత్‌షా కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కూడా అమిత్‌షా చెప్పినట్టు సమాచారం. గత ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలుపొందడం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తూ వుంటుంది. కానీ తెలంగాణలో మూడు ఉప ఎన్నికలు జరిగితే రెండింటిలో ప్రతిపక్ష బీజేపీ, కేవలం నాగార్జునసాగర్‌లో మాత్రం టీఆర్ఎస్ గెలుపొందడం విశేషం.
ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడులో గెలిస్తే… అదే విజయానికి బాటలు వేస్తుందనే ఉద్దేశంతో కేసీఆర్‌పై కోమటిరెడ్డి అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి బీజేపీలో చేరితే …తెలంగాణలో ఆ పార్టీ బలోపేతానికి తప్పక దోహదం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.