అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా అమరావతి నుంచి పరిపాలన రాజధాని విశాఖకు, అలాగే కర్నూలుకు హైకోర్టు తరలింపుతో న్యాయ రాజధాని చేయాలని సంకల్పించింది. అమరావతిలో శాసన రాజధాని మాత్రం వుంటుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజధాని మార్చే అధికారం ఏపీ సర్కార్‌కు లేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టును కర్నూలుకు తరలింపుపై కేంద్ర ప్రభుత్వం ఓ మార్గం సూచింది. లోక్‌సభలో కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయమై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టత ఇచ్చారు.
అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించాలనే ప్రతిపాదన తమకు అందిందని తెలిపారు. అయితే హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి, ఆమోదయోగ్యమైన తర్వాతే, తరలింపు ప్రతిపాదనను తమకు పంపాలని సూచించారు. అలాగే హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్గ్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయరాజధాని ఏర్పాటుకు అడ్డంకులు ఎదురు కావా? అలాగే మూడు రాజధానులపై ప్రభుత్వ మనసులో ఏముందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ప్రశ్నతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బయట పెట్టాలనే వ్యూహం కనిపిస్తోంది.
ఎందుకంటే మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఏదో ఒకరోజు మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం తప్పక మరో సంచలన నిర్ణయం తీసుకుంటుందనే భయం టీడీపీ, ఎల్లో టీంకు లేకపోలేదు. లోక్‌సభలో తాజా ప్రశ్నను పరిశీలిస్తే… ఏదో మనసులో ఆలోచన పెట్టుకునే వ్యూహాత్మకంగా మళ్లీ రాజధానుల తేనెతుట్టెను కదిలించారని అంటున్నారు.