టీడీపీ అధినేత చంద్రబాబులా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భయపడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్‌ఖడ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతను ముప్పుతిప్పలు పెట్టాలని ప్రయత్నించారు.
కానీ అన్ని రకాల అవరోధాలను మమతాబెనర్జీ ఎదుర్కొన్నారు. తనను ఇబ్బంది పెట్టాలని ఉత్సాహపడిన జగదీప్నకు మమతా బెనర్జీ కొన్ని సందర్భాల్లో చుక్కలు చూపించారు. మమతా బెనర్జీపై వేధింపులకు పాల్పడినందుకే అనూహ్యంగా జగదీప్ ధనఖడ్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారనే విమర్శ కూడా లేకపోలేదు. జగదీప్నకు వ్యతిరేకంగా మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో పనిచేస్తారని అందరూ భావించారు.
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ…. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాలకు ఆమె షాక్ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. తద్వారా ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేక ఓట్లు వేయకుండా పరోక్ష సహకారం అందించాలని నిర్ణయించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. విపక్షాల వైఖరికి నిరసనగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆమె ప్రకటించడం విశేషం.
ఇటీవల ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ కావడం, తాజాగా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీకి భయపడే మమతా బెనర్జీ వెనక్కి తగ్గారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థిగా టీఎంసీ నాయకుడు యశ్వంత్ సిన్హాను నిలబెడితే తాము మద్దతు ప్రకటించిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మధ్య ఏమంత గ్యాప్ లేదని, ఇంతలోనే మమతా బెనర్జీకి ఏమైందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మోదీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో జట్టు కడుతానని బీరాలు పలికిన మమతాబెనర్జీ వైఖరి చంద్రబాబు పంథాను గుర్తు చేస్తోందని అంటున్నారు.
గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా మమతాబెనర్జీ, రాహుల్‌గాంధీ తదితర నాయకులతో కలిసి చంద్రబాబు పని చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మోదీ, అమిత్‌షాల పేర్లు వింటే చాలు చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా పొరపాటున కూడా ఆయన మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు మమతాబెనర్జీ కూడా చంద్రబాబు బాటలో పయనిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటింగ్‌కు దూరంగా ఉన్నంత మాత్రాన …బీజేపీ దయతలచి విడిచి పెట్టదనే సంగతిని ఆమె గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రావాలంటే మమతాబెనర్జీ అడ్డు తొలగించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. రానున్న రోజుల్లో అదే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా వుండాలనే మమతా బెనర్జీ నిర్ణయంతో ఆమె రాజకీయంగా ఒంటరి అయ్యే ప్రమాదం లేకపోలేదు. అందరూ తాను చెప్పినట్టే వినాలని అనుకోవడం నియంతృత్వం. బీజేపీ చల్లని చూపు కోసం విపక్షాలకు దూరం కావడం మమతాబెనర్జీ తప్పటడుగు అని చెప్పిక తప్పదు.