Advertisement

Advertisement


Home > Movies - Reviews

'Thank You' Review: మూవీ రివ్యూ: థాంక్ యూ

'Thank You' Review: మూవీ రివ్యూ: థాంక్ యూ

టైటిల్: థాంక్ యూ
రేటింగ్: 2/5
తారాగణం: నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు తదితరులు
కథ: బి.వి.ఎస్. రవి
కెమెరా: పిసి శ్రీరాం
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: తమన్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: విక్రం కుమార్ 
విడుదల తేదీ: 22 జూలై 2022

పేరున్న నిర్మాత, సీనియారిటీ ఉన్న రచయిత, మనసుకి హత్తుకునే సినిమాలు తీస్తాడన్న పేరుగల దర్శకుడు, చెప్పుకోదగ్గ హీరో...వీరి కాంబినేషన్లో సినిమా అనగనే కొద్దొగొప్పో అంచనాలుంటాయి. 

కానీ అదేంటో మొదటి నుంచి ఈ సినిమాపైన అంచనాల సంగతి పక్కన పెడితే అసలిదొకటి వస్తోందన్న ఫీలింగే చాలామందిలో లేదు. ఎంత ఆగినా బజ్ రాలేదు. దానికి తోడు ట్రైలర్లో కూడా మెరుపులేవీ లేవు. ప్రేక్షకుల్ని థియేటర్స్ లాక్కురాగలిగే పాటలు కూడా పెద్దగా పండలేదు. 

మొత్తానికి నేడు హాల్లోకోచ్చి హలో చెప్పిన ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు చివరకు థాంక్ యూ చెప్పారో లేదో చూద్దాం. 

ఎం ధర్మరాజు ఎం.ఏ లో లాగ కాస్త సక్సెస్ రాగానే కళ్లు బైర్లు కమ్మి సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయే హీరో. తన ఎదుగుదలకు కారణమైన వారిని కూడా ఏ మాత్రం పట్టించుకోని యారొగెన్స్ అతనిది. ఫలితంగా ఒక సంఘటన జరుగుతుంది. దాంతో అతనిలో అంతర్మథనం మొదలైపోతుంది. వెంటనే బయలుదేరి చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని మలుపు తిప్పి తానింతటి వాడవ్వడానికి దోహదపడిన వారినందర్నీ కలిసి థాంక్ యూ చెప్తాడు. అదీ కథ. 

లైన్ గా బాగానే ఉన్నా ఏది ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది పూర్తిగా గాలికొదిలేసారు. కథలో లోపముందా..లేక కథని ఓన్ చేసుకోలేక తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడా అనేది పక్కన పెడితే ఏ మాత్రం లోతు లేని, మనసు లోతుల్ని తాకని సినిమా అనిపించుకుంది. 

ఈ మొత్తం కథలో ఇద్దరమ్మాయిలకి, ఒకబ్బాయికి థాంక్ యూ చెప్పాడంతే. అది కూడా చాలా హడావిడిగా దర్శకుడు చెప్పాడు కాబట్టి పాత్రలు కలిసిపోతుంటాయి తప్ప ఒక ఆర్గానిక్ ఫ్లో కనపడదు. 

శ్రీకాంత్ అడ్డాల సినిమాలోలాగ ఇందులో అందరూ మంచివాళ్లే. తాత్కాలికంగా చెడ్డవాళ్లలా కనిపించినా ఒక్క సీన్లో సడెన్ గా మారిపోయి చెమ్మగిల్లిన కళ్లతో కౌగిలించేసుకునే టైపులోనే ఉంటారంతా. అంత మంచితనాన్ని, క్షణాల్లో చోటు చేసుకునే మార్పుని చూసి ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారని దర్శకుడు ఆశించుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటుండదు. 

నా ఆటోగ్రాఫ్ లో హీరో వెనక్కొచ్చి తన జీవితాన్ని టచ్ చేసిన అమ్మాయిలందర్నీ కలుస్తాడు. అందులో మనసుకి పట్టుకునే ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. ప్రతి వాడు తమ గతంలోకెళ్ళి మధురస్మృతుల్ని నెమరేసుకునేలా చేసింది ఆ చిత్రం. కానీ ఇందులో ఆ దాఖలాలు కనపడవు. 

పార్వతి (మాళవిక నాయర్) తండ్రికి హీరో ఏం చెబితే అతనిలో ఒక్క పూటలో అంత మార్పొచ్చేసిందనేది క్లారిటీ ఇవ్వలేదు. 

కాలేజ్ లో శర్వా పాత్రవల్ల ఒనగూరిన ఎమోషనేమీ లేదు. మరీ సాఫ్ట్ గా ఉండకుండా కాస్త ఫైట్లు గట్రా పెట్టడానికి ఆ వైజాగ్ ఎపిసోడ్ పెట్టారు తప్ప ఎమోషన్ మాత్రం పండించలేకపోయారనిపిస్తుంది. 

ఉన్నంతలో పాజిటివ్ చెప్పుకోవాలంటే ఒక్క పార్వతి (మాళవిక నాయర్) పల్లెటూరి లవ్ ట్రాక్ మాత్రం బాగుంది. అలాగే "థాంక్ యూ..." అంటూ సాగే సాంగ్ కూడా క్యాచీగా ఉంది. కానీ అది తమన్ స్వరపరిచినట్టు కాకుండా మిక్కీ జె మేయర్ ఫక్కీలో ఉంది. 

హాల్లో సినిమా రెండు గంటల్లో పూర్తవడం బాగానే ఉంది కానీ ఒక్క వారంలో తెర మీదున్న హీరో పశ్చాత్తాపం పొందేయడం, అనుకున్నవాళ్లని ఇండియా వెళ్లి కలిసొచ్చేయడం సినిమాటిక్ గా ఉంది. 

సాంకేతికంగా చెప్పుకోవాలంటే మంచులో మునిగిన సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. ఒక్క పాట మినహాయించి మిగిలిన పాటలు గానీ, నేపథ్య సంగీతం కానీ ఏ మాత్రం హత్తుకోవు. 

ఇంతా చేసి ఇద్దరికేనా హీరో థాంక్ యూ చెప్పాడు అనే డౌట్ రావొచ్చు. అయితే 40 నిమిషాలు కట్ చేసారని వార్తలొచ్చాయి. బహుశా అందులో ఇంకో ఇద్దరికెవరికైనా థాంక్ యూ చెప్పాడేమో మరి. ఆ సంగతి ఎడిటర్ కి తెలియాలి. 

ఇలాంటి సినిమాల్లో సంభాషణలకి చాలా స్కోపుంటుంది. కానీ అత్యంత దయనీయమైన, పేలవమైన డయలాగ్స్ రాసుకున్నారు. 

నాగ చైతన్య మాత్రం సినిమాని రకరకాల వయసుల గెటప్స్ తో బాగానే మోసినా ఎందుకో ఆకట్టుకోలేదు. రాశి ఖన్నా ఏడుపుకళ్లతోటే గుర్తుంటుంది చివరికి. హీరోకి చెల్లెలు వరస పాత్రలో అవికా గోర్ పర్వాలేదు. శర్వాగా చేసిన సాయి సుశాంత్ లో ఈజ్ ఉంది. 

మంచి పాయింట్ ని ఎక్జిక్యూట్ చేయడంలో శ్రద్ధ వహించకపోవడం వల్ల, చాలా విషయాల్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడం వల్ల ఫలితం ఆశించినట్టు రాలేదు. 

ప్రేక్షకులు ఒకే ఒక్క విషయానికి మాత్రం దర్శకుడికి థాంక్ యూ చెప్పాలి- రెండు గంటల్లో ముగించేసినందుకు. 

బాటం లైన్: నో మెన్షన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?