ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుగానే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. వైసీపీ ప్లీనరీలో సమరశంఖాన్ని ఆయన పూరించారు. కుప్పం సహా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవడమే లక్ష్యమని దిశానిర్దేశం చేశారు. అయితే వైసీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు… వైఎస్ జగన్ ప్రధానంగా ఐదుగురిని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు తెలిసింది.
కుప్పంలో చంద్రబాబు, టెక్కలిలో అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి, విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్‌రావులతో పాటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఓడించడమే ఆశయంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వీరిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులతో కలిపి నలుగురు టీడీపీ, ఒక్కరు జనసేన నాయకులు కావడం విశేషం.
కుప్పంలో ఇప్పటికే వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో విస్తృతంగా వలసలు సాగుతున్నాయి. దీంతో పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో మొదలైంది. చంద్రబాబు తర్వాత వ్యక్తిగతంగా తనను అచ్చెన్నాయుడు టార్గెట్ చేశారనే అక్కసు జగన్‌లో బలంగా ఉంది. అందుకే రాజకీయంగా అచ్చెన్నాయుడి అంతు చూడాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.
బుచ్చయ్య చౌదరి కాస్త అతి చేస్తున్నారనే భావన జగన్‌లో ఉంది. ఒకవైపు రాజకీయాలు విరమిస్తానని చెబుతూనే, ఘాటు వ్యాఖ్యలతో ఇరిటేట్ చేస్తున్నారని జగన్ కోపంగా ఉన్నారు. గద్దె రామ్మోహన్‌రావు విషయానికి వచ్చే సరికి… రాజధాని ప్రాంతంలో బలంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.
ఇక జనసేనాని పవన్‌కల్యాణ్, జగన్ మధ్య పోరు గురించి అందరికీ తెలిసిందే. తనను కక్ష కట్టి ఓడించారని ఇటీవల పవన్‌కల్యాణ్ వాపోయిన సంగతి తెలిసిందే. ఈ దఫా జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపుతానని పవన్ భీష్మ ప్రతిజ్ఞ చేయడం జగన్‌కు రుచించడం లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ నిలిచిన రెండు చోట్ల ఓడించినప్పటికీ జగన్ సంతృప్తిగా లేరు. 2024 ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో జగన్ మున్ముందు చాలా చేయనున్నారు. ఇంకా పవన్‌కల్యాణ్ సీటుపై క్లారిటీ లేకపోవడంతో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. జగన్ పట్టు పడితే సాధించే వరకూ నిద్రపోరనే సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థులు కూడా జగన్‌ను ఇంటికి సాగనంపే వరకూ విశ్రమించేది లేదని అంటున్నారు.
అంతేకాదు, సీఎంగా తప్ప ఏపీ అసెంబ్లీలో అడుగే పెట్టనని చంద్రబాబు ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు భీకర యుద్ధాన్ని తలపిస్తాయనడంలో సందేహం లేదు.