తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్స్‌తో ప్రత్యర్థులను రాజకీయంగా చితక్కొడుతున్నారు. సందర్భం, సమయానుకూలంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై వ్యంగ్యాస్త్రాలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇందుకు ట్విటర్‌ను వేదిక చేసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతామని బండి సంజయ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన మార్క్ విమర్శలతో బండి సంజయ్‌పై ఎదురుదాడికి దిగారు.
“సంజయ్‌ను ఈడీకి కూడా చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. ఈ దేశాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న డబుల్ ఇంజన్ అంటే మోడీ, ఈడీలే అని మనందరికీ బాగా అర్థమైంది” అని కేటీఆర్ చురకలు అంటించారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా ఈ డబుల్ ఇంజన్ తెరపైకి వచ్చింది. ప్రత్యర్థులు, గిట్టని వారి ఇళ్లపైకి యంత్రాలను తరలించి అక్కడి యోగి ప్రభుత్వం దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఉత్సాహంగా ఉంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ పాలన వస్తుందనే నినాదంతో బీజేపీ దూసుకొస్తోంది. దీన్ని సందర్భోచితంగా కేటీఆర్ తిప్పి కొట్టడం ఆకట్టుకుంటోంది.