రాజకీయ నాయకుల ఐడియాలు కొన్ని బాగుంటాయి. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు కదా. ప్రభుత్వ చర్యలను ఎండగడతారు కదా. కానీ ఆ విమర్శల్లోనుంచే ఒక్కోసారి ఆలోచించాల్సిన అంశాలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు వాటిని చర్చకు పెడితే ఎలా ఉంటుందని అనిపిస్తుంది. చాలా ఏళ్ళ కిందట కేంద్రప్రభుత్వం సమాచార హక్కు చట్టం అని ఒక చట్టం తెచ్చింది. ప్రభుత్వంలో లేదా ప్రభుత్వ శాఖల్లో ఏ జరుగుతున్నదో, ప్రజలకు సంబంధించిన పనులు కావొచ్చు, కార్యక్రమాలు కావొచ్చు, పథకాలు కావొచ్చు ఎలా అమలు జరుగుతున్నాయో ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని ప్రభుత్వం భావించింది.
ఏదీ రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రతిఒక్క విషయాన్ని తెలుసుకోవడానికే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది. కానీ అది కూడా సరిగా అమలు కావడంలేదనుకోండి. అది వేరే విషయం. కానీ ప్రభుత్వాలు ఏం చేసినా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఏదీ నాలుగు గోడల మధ్య జరగకూడదు.
మోడీ ప్రభుత్వం తనకు పడని వారిని అంటే ప్రతిపక్ష నాయకులను అనవసరంగా వేధిస్తోందని, కేసులు బనాయిస్తోందని, ఈడీ, ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు చేయిస్తోందని, విచారణల పేరుతో మానసికంగా వేధిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. ఇది బయటకు కనబడుతున్న దృశ్యం. ఈడీ, ఎన్ ఫోర్స్ మెంట్ దాడులను, విచారణను ఎదుర్కొంటున్న నాయకులంతా పత్తిత్తులని చెప్పలేం. అవినీతిపరులూ బొచ్చెడుమంది ఉన్నారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరిని వేధిస్తుందనే పేరుబడింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ విచారిస్తుండటం తెలిసిందే కదా. దీనిముందు రాష్ట్రపతి ఎన్నికలకు ప్రాధాన్యం పోయిందనే చెపొచ్చు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేస్తోంది. అన్ని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా పార్లమెంటులో ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అంటే భగ్గుమనే కేసీఆర్ కూడా సోనియా గాంధీని మోడీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడుతున్నారు.
నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ, అలాగే అదే పార్టీకి చెందిన మరి కొందరు ముఖ్య నేతలపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఇది ఇప్పుడు నమోదైన కేసు కాదు, యూపీఏ ప్రభుత్వ హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో నమోదైన కేసు.
అయితే, అప్పట్లో విచారణ లేకుండానే, విచారణ సంస్థలు కేసును కొట్టేశాయి. ఆ తర్వాత ఎంపీ సుబ్రమణ్య స్వామి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపధ్యంలో కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్,(ఈడీ) ఇతరులతో పాటుగా సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది.
నిజానికి, గత నెలలోనే ఈడీ నోటీసులు జారీ అయినా… అనారోగ్యం (కొవిడ్) కారణంగా ఆమె, అప్పుడు ఈడీ విచారణకు హాజరు కాలేక పోయారు. వాయిదా కోరారు. ఈడీ ఆమె కోరిన విధంగా వాయిదాకు అంగీకరించి, తాజాగా జులై 21, 22 తేదీల్లో విచారణకు హాజరు కావాలని మరో మారు సమన్లు జారీ చేసింది.ఈ నేపధ్యంలో, ఆమె జులై 21 న ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే అవినీతికి పాల్పడటమే. సోనియా, రాహుల్ నిజంగా అవినీతికి పాల్పడ్డారా అనేది తెలియదు. సోనియా గాంధీని ఈడీ నిన్న రెండు గంటలపాటు విచారించింది.
రాహుల్ ను కూడా అంతకుముందు కొన్ని గంటలపాటు విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈడీ ఏమడిగింది? వీళ్ళు ఏం చెప్పారనేది ప్రజలకు తెలియదు. మరి ఒక ప్రముఖ జాతీయ పార్టీ అధ్యక్షురాలిని, ఆమె కుమారుడిని విచారిస్తున్న కేసులో ఏం జరుగుతున్నదో ప్రజలకు తెలియాలి కదా. వాస్తవానికి తెలుకునే హక్కు కూడా ప్రజలకు ఉంది. ఈ విషయాన్నే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కొత్త విధంగా చెప్పారు. ఇది ఆలోచించాల్సిన పాయింటే.
కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈడీ విచారణను టీవీ చానెళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఈడీ ఏం ప్రశ్నలు అడిగిందో, వాటికి సోనియా గాంధీ ఏం జవాబులు చెప్పారో ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజలు ఏది వాస్తవమో తెలుసుకుంటారని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి ఆలోచనే. ఇది కూడా సమాచారం తెలుసుకునే హక్కు కిందికే వస్తుంది కదా. సోనియా గాంధీని మళ్ళీ ఈ నెల 25 న విచారణకు రమ్మని చెప్పారు.