శ్రీలంక లేకపోతే చంద్రబాబునాయుడు, ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి శ్రీలంకను ఆయుధంగా మలుచుకున్నాయి. ఏపీలో పరిస్థితులు శ్రీలంకను మరిపించేలా ఉన్నాయని చంద్రబాబు సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు పదేపదే విమర్శిస్తున్నారు. ఏపీపై ప్రేమతో అంటున్న మాటలు కావివి. శ్రీలంక కంటే అధ్వానమైన దుస్థితిలోకి జగన్ పాలనలో ఏపీ వెళ్లాలని మనసులో కోరుకుంటున్న పరిస్థితి.
ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంకగా జగన్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. డబ్బులివ్వడానికి బటన్ నొక్కుతున్నానంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని.. అదే బటన్ నొక్కి ప్రజలు ఇంటికి సాగనంపుతారని హెచ్చరించారు. బటన్ నొక్కడంపై చంద్రబాబు అక్కసును ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఓ అస్త్రం కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక దుర్భర పరిస్థితి టీడీపీకి వరంలా మారింది.
సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తారని ఆరోపణలు చేస్తే రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని టీడీపీ ఆందోళన చెందుతూ వచ్చింది. సంక్షేమ పథకాల మూడ్ నుంచి జనం దృష్టిని మరల్చేందుకు ముఖ్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా శ్రీలంక అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే అనేక అంశాలున్నాయి. కానీ వాటిని వదిలిపెట్టి కేవలం శ్రీలంకనే పట్టుకుని వేలాడుతుండడం వెనుక చంద్రబాబు ఎత్తుగడ వేరే ఉంది.
శ్రీలంకను చూపి ఏపీ ప్రజానీకాన్ని భయపెట్టాలనేది ఆయన వ్యూహం. జగన్ పాలనలో అప్పులపాలై, శ్రీలంకలో మాదిరిగా మనం కూడా రోడ్డున పడాల్సి వస్తుందనే ఆందోళనను క్రియేట్ చేయడం ఎల్లో బ్యాచ్ పన్నాగం. ప్రజాగ్రహాన్ని జగన్‌పై తిప్పేందుకు శ్రీలంక ఒక్కటే సరైన అస్త్రమని చంద్రబాబు నమ్మకం. శ్రీలంక తనను ఆపద్బాంధవుడిలా ఆదుకుందని బాబు తెగ సంబరపడుతున్నారు.
ఎందుకంటే ఇప్పట్లో అదే లేకపోతే జగన్‌పై బలమైన వ్యతిరేక ప్రచార అంశమే టీడీపీకి లేదు. ఇటీవల వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ఘన విజయం సాధించడంతో పేద, మధ్య తరగతి వర్గాల్లో జగన్‌పై అభిమానం వుందనే ప్రచారానికి తెరలేచింది. దీనికి సంక్షేమ పథకాల అమలే కారణనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధి దారుల్లో సైతం జగన్‌పై వ్యతిరేకత పెంచడానికి శ్రీలంక తప్ప మరో దిక్కులేదని చంద్రబాబు ఆలోచన. శ్రీలంక ఆయుధంతో జగన్‌పై విజయం సాధ్యమా? అనేది కాలమే తేల్చాల్సి వుంది.