భారతదేశంలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి దక్కింది. ఒదిశా ఆదివాసీ మహిళ దేశంలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో.. ఎంత చిన్న స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వ్యక్తులైనా సరే.. ఎంత తక్కువ స్థాయి గల మూలాలు కలిగిన వారైనా సరే.. ఎంతటి అత్యున్నత పదవులనైనా అలంకరించగలరని మరోమారు నిరూపణ అయింది.
పేదరికం నేపథ్యం నుంచి ఎదిగివచ్చిన ద్రౌపది ముర్ము.. భారతదేశపు రాష్ట్రపతి మాత్రమే కాదు.. ఈ దేశపు ప్రతిష్ఠకు ప్రతీక! ఈ సందర్భంగా.. యావత్ దేశంలోని గిరిజన, ఆదివాసీ జాతులకు చెందిన ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. తమ వర్గాలనుంచి ఒక మహిళ తొలిసారిగా ఈ ఘనతను నమోదు చేయడం వారికి ఖచ్చితంగా పండగే.
ఈ పండగ వారికి ఎంత గొప్పది. ద్రౌపది పదవిలో ఉన్నంత కాలమూ.. వారికి పండగ వాతావరణమే ఉంటుందా? ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి.. ఒక అత్యున్నత పదవికి వెళ్లినంత మాత్రాన.. ఆ జాతికి సామూహికంగా ఒరిగే ప్రయోజనం ఏముంటుంది? వారికి ఏ అదనపు సదుపాయాలు సమకూరుతాయి.. ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నలు.
ద్రౌపది రాష్ట్రపతి కాగానే.. దేశంలోని గిరిజన, ఆదివాసీ తెగలకంతా ఇదొక పండగ అని.. అందరూ ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ బిజెపి ఈ రకమైన ప్రచారంతో.. విజృంభించడానికి సహజంగానే అవకాశం ఎక్కువ. ఒక్క ద్రౌపదికి ఈ పదవి ఇవ్వడంతో యావత్ గిరిజన సమాజాన్ని ఉద్ధరించేసినట్లుగా వారి భావిస్తే వారి తప్పు కాదు. వారు అలాంటి ప్రచారాన్నే కోరుకుంటారు. కానీ ఆ ప్రచారాన్ని ప్రజలందరూ కూడా నమ్మితేనే తప్పు. కానీ ప్రజలు నమ్మేలా.. ద్రౌపదికి దక్కిన పదవిని మించి.. ఈ గిరిజన జాతికి మరొక గొప్ప మేలు ఏమీ ఉండదని అనిపించేలా ప్రచారం జరుగుతోంది.
మీడియా అనేది తెలిసో తెలియకో చేసే అనేకానేక దుర్మార్గాల్లో ఇది కూడా ఒకటి. అసలే రబ్బర్ స్టాంప్ గా ముద్రపడిన రాష్ట్రపతి పదవిలో గిరిజన మహిళను కూర్చోబెట్టినా, మరొక అగ్రవర్ణాల వారిని కూర్చోబెట్టినా తేడా ఏమీ ఉండదు. అంతే తప్ప నిర్ణయాలు తీసుకునే అసలైన కేంద్ర మంత్రి వంటి పదవుల్లో ఎందరు గిరిజనులు ఉన్నారు అనేది కీలకమైన విషయం.
ఒక రకంగా చెప్పాలంటే.. కేంద్రం కావొచ్చు, రాష్ట్రాలు కావొచ్చు.. మంత్రివర్గాల్లో ఏయే కులాలకు, సామాజిక వర్గాలకు చెందిన వారు ఎందరేసి ఉన్నారనే లెక్కలు తీయడం కూడా చాలా సంకుచితమైన విషయం. అది కరెక్టు కాదు. ఆయా ప్రభుత్వాలు.. ఆయా వర్గాల అభ్యున్నతికి మేలు జరగడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ నిర్ణయాలను ఎలా అమలు చేస్తున్నాయి.. అనేది మాత్రమే ముఖ్యమైన విషయం.
గిరిజన సంక్షేమానికి నిర్మాణాత్మకమైన పనులు చేయకుండా.. కేవలం మాటలు చెబుతూ.. అమలయ్యే పథకాలను పక్కదారి పట్టిస్తూ ఉన్నంత కాలం.. ద్రౌపదిని రాష్ట్రపతి చేయడం కలిగే పండగ ఆనందం హరించుకుపోతూనే ఉంటుంది.
ద్రౌపది ఎదుట ఒక మంచి అవకాశం ఉంది. ఒక ఆదివాసీ గిరిజన మహిళ.. అత్యున్నత స్థానంలో ఉంటే.. ఆ స్థానానికి ఉన్న రబ్బర్ స్టాంప్ ముద్రను కొనసాగించబోదని, ఆదివాసీ పౌరుషాన్ని, స్వయం నిర్ణయాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా.. మరింత క్రియాశీలంగా పనిచేయగలదని.. జాతికి, (గిరిజన జాతికి కాదు, భారతజాతికి) మేలు చేయని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే గనుక.. వాటిని వెనక్కి తిప్పికొట్టి.. రబ్బర్ స్టాంప్ ముద్ర తొలగిపోయేలా.. ఆ రాష్ట్రపతి స్థానానికి గౌరవం పెరిగేలా వ్యవహరించగలదని కోరుకుందాం.