ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడంపై దేశ వ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలో సంబరాలు చేసుకుంటున్నారు. స్వతంత్ర భారతావనిలో ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కావడానికి ఏడు దశాబ్దాల కాలం పట్టడం గమనార్హం. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడంతో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే క్రమంలో ఆమెకు మద్దతు ప్రకటించినట్టు ఏపీ అధికార, ప్రతిపక్షాలు వైసీపీ, టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరీ ముఖ్యంగా జగన్ అయితే ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల పదవుల్లో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. పదవులు ఇవ్వడం వరకూ అభినందించాల్సిందే. మరి పవర్ వాళ్ల చేతిలో ఉందా? అంటే, లేదనే సమాధానం వస్తోంది. ఉదాహరణకు హోంశాఖ మంత్రిగా తానేటి వనిత ఉన్నారు. కనీసం హోంగార్డును ట్రాన్స్‌ఫర్ చేసే పవర్ ఆమె చేతిలో ఉందా? అనే ప్రశ్నకు లేనే లేదనే సమాధానం వస్తుంది.
అలాగే చిన్న వయసులోనే మంత్రి అయిన విడదల రజనీ చేతిలో ఆమె శాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందా? అంటే లేదని చెప్పొచ్చు. కనీసం తన కావాల్సిన ఉద్యోగిని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అధికారం కూడా ఉండే అవకాశం లేదు. ఈ వాస్తవం చెప్పడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. ఎందుకంటే అధికారంలో చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా…పవర్స్ తమ చేతిలో పెట్టుకుని పదవుల పందేరం చేస్తారనేది జగమెరిగిన సత్యం.
జగన్ కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలున్నారని గొప్పులు చెప్పుకోవడం తప్ప, వారికి ఒరిగిందేమీ లేదు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్‌రావు లాంటి సీనియర్ మంత్రులు తప్ప మిగిలిన వారు కేవలం ఉత్సవ విగ్రహాలే అనే విమర్శ లేకపోలేదు.
ఇక స్థానిక సంస్థల పదవుల అధికారాలకు సంబంధించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పేరుకు పదవుల్లో అణగారిన వర్గాల వారే అయినా, పెత్తనం అంతా ఎంపీ, ఎమ్మెల్యేలు, వారి వారసులదే. జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, గ్రామ సర్పంచ్, జెడ్పీటీసీ ఇలా ఏ పదవి తీసుకున్నా…. అణగారిన వర్గాలకు పదవులు తప్ప పవర్ నిల్.
సమాజంలో బీసీల జనాభా 50 శాతం ఉన్నారు. కానీ పాలక వర్గాల జనాభా నాలుగైదు శాతం కంటే ఎక్కువ లేదు. ఆత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలకు పదవులు భిక్ష వేస్తున్నామని అగ్రవర్ణ పాలక వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ పాలక వర్గాలు చెప్పే సామాజిక న్యాయం ఒక పెద్ద బూతు.
అణగారిన వర్గాలకు పవర్ కథ దేవుడెరుగు… పదవుల్లో ఉన్న వాళ్లు తమకు తెలియకుండా ఇతరులతో మాట్లాడితే సహించలేని మనస్తత్వం పాలకవర్గాలది. నిజంగా అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం రావాలంటే… వారిలో చైతన్యం రావాలి.
ఎవరో ఇస్తే కాదు, పదవులను, పవర్‌ను తాము సాధించుకునే స్థాయికి ఎదగాలి. అప్పుడే ఆ అణగారిన సామాజిక వర్గాలకు ప్రయోజనం వుంటుంది. లేదంటే పదవుల్లో వుంటూ అగ్రవర్ణ పాలకుల పల్లకీలు మోస్తూనే వుండాల్సిన దుస్థితి కొనసాగుతూనే వుంటుంది. అధికార రుచి మరిగిన వారి నుంచి దాన్ని సాధించుకోవాలంటే మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.