రాజకీయాల్లోనే కాదు సినిమ రంగంలో కూడా జంప్ జిలానీ లు వుంటారు. టాలీవుడ్ లో కొన్ని డైరక్టర్ల క్యాంప్ లు వుంటాయి. వివిధ ఈక్వేషన్ల కారణంగా టాలీవుడ్ లో కొన్ని గ్రూపులు లేదా క్యాంప్ లు వుంటాయి.
ఒక గ్రూప్ లో వున్న వాళ్లంతా ఒకరి భుజాలు ఒకరు చరచుకుని వాళ్లలో వాళ్లు శభాష్ అనుకుంటూ మద్దతుగా నిలవడం మామూలే. అయితే ఒక్కోసారి తేడా వస్తే ఈ డైరక్టర్ క్యాంప్ లోంచి ఆ డైరక్టర్ క్యాంప్ లోకి మారడమూ మామూలే.
ఇప్పుడు టాలీవుడ్ లో ఓ పెద్ద డైరక్టర్ శిష్యబృందం లేదా స్నేహ బృందం ఇప్పుడు క్యాంప్ మార్చేసిందని వార్తలు వినవస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ చుట్టూ ఓ స్నేహ బృందం లాంటి భజన బృందం వుండేదట. ఆచార్య తరువాత కొరటాల టైమ్ బాగాలేదు. పైగా మరో మాస్ కమర్షియల్ దర్శకుడితో కొరటాల కు దగ్గరగా వుండే వాళ్లకు సరిపడలేదు.
దాంతో ఇప్పుడు ఓ టాప్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ దర్శకుడు, ప్రభాస్ తో భారీ సినిమా అందించిన దర్శకుడు ఒకరు, కొరటాలకు చేదోడు వాదోడుగా వుండే రైటర్ ఒకరు ఇలా పలువురు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్యాంప్ కు షిఫ్ట్ అయ్యారట.
తరచు ఇప్పుడు త్రివిక్రమ్ చుట్టూ తిరుగుతూ అక్కడ షో రన్ చేస్తున్నారని బోగట్టా. అక్కడ పవన్ తో సినిమా సంపాదించాలని ఒక డైరక్టర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తున్నారు. తరువాత బన్నీ తో చేస్తారు. అందువల్ల అతని గుడ్ లుక్స్ లో వుంటే బెటర్ అని మిగిలిన వాళ్లు కూడా అక్కడకు చేరిపోయారట.
అయితే ఒకందుకు పోస్తే మరొకందుకు తాగాడని సామెత… వీళ్లు ఒకందుకు దగ్గరకు చేరితే త్రివిక్రమ్ మరొకందుకు చేరదీస్తున్నారేమో? కొరటాల దగ్గర వున్నపుడు బయట తన మీద ఇదే బ్యాచ్ చేసిన రకరకాల కామెంట్లు త్రివిక్రమ్ కు బాగా తెలుసు అని బోగట్టా. అందువల్ల మాటల మాంత్రికుడి దగ్గర వీళ్ల మంత్రాంగాలు ఏవీ పనిచేయకపోవచ్చు.