తను ఒక స్టార్ అనే ఫీలింగ్ అతడికి ఏ మాత్రం ఉండదు.. అని అంటోంది అనన్యాపాండే. నటుడు విజయ్ దేవరకొండను ఉద్ధేశించి అనన్య ఈ వ్యాఖ్య చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ 'ఫైటర్' సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ తో పని చేసిన అనుభవం గురించి ఈ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వివరించింది. విజయ్ చాలా వినయ,విధేయలతో ఉంటాడంటూ ఈమె సర్టిఫై చేసింది. తను ఒక స్టార్ అనే అహం అతడిలో ఏ మాత్రం ఉండదని అనన్య పాండే చెప్పుకొచ్చింది.
ఇక విజయ్ సినిమాతో తను సౌత్ కు పరిచయం కాబోతుండటం తనలో ఉత్కంఠను రేకెత్తిస్తోందని అనన్య వివరించింది. సౌత్ ప్రేక్షకులు తనను ఎలా ట్రీట్ చేస్తారనే అంశంపై ఈ హీరోయిన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందట. ఇక అదే సినిమాతో విజయ్ బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తుండటాన్ని అనన్య ప్రస్తావించింది. ఈ సినిమా హిందీలో కూడా విడుదల కాబోతూ ఉన్న నేపథ్యంలో.. విజయ్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందనే అంశం గురించి ఆలోచిస్తున్నాడని అనన్య పేర్కొంది.
ప్రస్తుతం అందరూ ఉత్కంఠలు, ఎదురుచూపుల్లో ఉండాల్సిన పరిస్థితే ఉంది. కరోనా కల్లోలం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకూ సినిమాల విడుదలలు ఉండకపోవచ్చు. అలాగే, షూటింగ్ దశల్లో ఉన్న సినిమాలకూ ఈ సెగ తగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అందరివీ ఎదురుచూపులే!