సోషల్ మీడియాకు వ్యతిరేకంగా ఏ చిన్న సమాచారం ఉన్నా పతివ్రతా శిరోమణి ఆంధ్రజ్యోతి అనే పత్రిక కళ్లకద్దుకుని మహాప్రసాదంగా భావించి అచ్చేస్తోంటోంది. ఇందులో తప్పు పట్టాల్సింది లేదా అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదు. కానీ అలాంటి వార్తలను పని కట్టుకుని ఆంధ్రజ్యోతి ప్రచురించడం వెనుక ఉద్దేశమే అభ్యంతరకరమైంది.
తాజాగా ఆంధ్రజ్యోతి వెబ్ పేజీలో ప్రముఖంగా క్యారీ చేసిన ఓ చిన్న వార్తనే తీసుకుందాం. “మేం సోషల్ మీడియాను నమ్మం!” అనే శీర్షికతో వార్త క్యారీ చేశారు. వార్తా కథనంలోకి పోతే…కరోనాపై సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారాన్ని విశ్వసించడం లేదని నాగ్‌పూర్‌కు చెందిన రాష్ట్రసంత్ తుకడోజీ మహరాజ్ అనే విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గత నెల 28 నుంచి ఈ నెల (ఏప్రిల్) 4వ తేదీ వరకు చేసిన పరిశోధనలో వెల్లడైందని రాశారు.
కరోనా గురించి సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్ముతున్నారా అని 1400 మందిపై అధ్యయనం జరిపితే…సోషల్ మీడియా వార్తల పట్ల విశ్వాసం లేదని 10 శాతం మంది చెప్పినట్టు తేల్చారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కరోనాపై ఉన్న సమాచారంలో మూడింట రెండొంతులు తప్పే అని భావిస్తున్నట్టు ఆ సర్వేలో తేలిందని ఆంధ్రజ్యోతిలో రాశారు.
అంతేకాదు, అసలైన సమాచారం కోసం ప్రజలు వార్తా పత్రికలు, ఈ-పేపర్లపైనే ఆధారపడుతున్నట్టు సర్వేలో తేలిందని ఆంధ్రజ్యోతి చంకలు గుద్దుకుంటూ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి రాసుకెళ్లింది.
అంటే పరోక్షంగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రాసేదే కరెక్ట్, కొత్తగా వచ్చిన సోషల్ మీడియాను పట్టించుకోవద్దని…పతివ్రతా శిరోమణి చెప్పుకొచ్చింది. మరి కేవలం పది శాతం మంది మాత్రమే సోషల్ మీడియా వార్తల పట్ల విశ్వాసం లేదన్నారంటే, మిగిలిన 90 శాతం మంది విశ్వాసం ఉందని చెప్పినట్టే అని ఆంధ్రజ్యోతి అంగీకరించినట్టేనా?
అయినా విశ్వసనీయత అనేది పత్రికలు, ఈ-పత్రికలు అని పేరు పెట్టుకుంటే వచ్చేది కాదు. ఏ మీడియాలోనైనా రాసే వార్తలను బట్టి విశ్వసనీయత వస్తుందే తప్ప…సోషల్ మీడియా అంటే చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. భవిష్యత్ అంతా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనే వాస్తవాన్ని గ్రహించి…ఇప్పటికైనా వాటిపై బురద చల్లడం మానేస్తే ఆంధ్రజ్యోతికే మంచిది. అయినా ఆంధ్రజ్యోతి విశ్వసనీయత ఏంటో లోకానికి తెలియంది కాదు. ఆంధ్రజ్యోతి రంకును బట్టబయలు చేస్తున్న సోషల్ మీడియా అంటే ఆర్‌కేకు గిట్టకపోవడంలో ఆశ్చర్యం ఏముంది?