కోనసీమలో చిచ్చుకు అంబేద్కరా లేక దావోస్‌లో పెట్టుబడులపై సానుకూలతే కారణమా? అనే చర్చకు తెరలేచింది. ఏపీలో భారీ పెట్టుబడులకు సీఎం జగన్ పర్యటన దోహదం చేస్తోంది. ఇదే కోనసీమలో కులచిచ్చు రగిల్చడానికి పరోక్షంగా కారణమైందనే అనుమానాల్ని అధికార పార్టీ వ్యక్తం చేస్తోంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్న తరుణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడంపై వైసీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కోనసీమ మంటల వెనుక టీడీపీ, జనసేన ఉన్నాయని వైసీపీ గట్టిగా చెబుతోంది. ఇందుకు పలు కారణాలను ఉదహరిస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు కరువయ్యాయనే సంకేతాల్ని పంపడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల రాకను అడ్డుకోవచ్చనే కుట్రలో భాగంగానే కోనసీమలో వ్యూహాత్మకంగా మంటలు రగిల్చారని వైసీపీ విమర్శిస్తోంది.
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ముందుకొచ్చిందని అధికార పార్టీ చెబుతోంది. అలాగే విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ఆసక్తి కనబరిచిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు చొరవ చూపుతోంది.
ప్రధానంగా ఏపీలో గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు రూ.60 వేల కోట్లు భారీ పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ముందుకు రావడం ఏపీ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయంటున్నారు. ఏపీకి పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక కుల గొడవలను సృష్టిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా తయారు చేయడానికి కూడా టీడీపీ, జనసేన వెనుకాడడం లేదనే విమర్శలు అధికార పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ఇందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నిస్సిగ్గుగా వాడుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి.