మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది భోళాశంకర్ సినిమా. ఈ మూవీలో తమ్ముడు పవన్ కల్యాణ్ ను, అన్నయ్య చిరంజీవి ఇమిటేజ్ చేశారు. మెడపై నుంచి వేళ్లు లోపలికి పోనిచ్చే మేనరిజమ్ తో పాటు, పవన్ స్టయిల్ ను కూడా అనుకరించారు. అన్నయ్య ఇలా తమ్ముడ్ని అనుకరించడంపై దర్శకుడు మెహర్ రమేష్ స్పందించాడు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ ను అనుకరించడం అనే ఐడియా పూర్తిగా తనదే అని ప్రకటించుకున్నాడు మెహర్. అన్నయ్యపై తనకు అభిమానం ఉంటే, పవన్ కల్యాణ్ పై తనతో పాటు చాలామందికి ఉన్మాదం ఉందని, ఆ మితిమీరిన అభిమానమే, తనతో ఈ పని చేయించిందని మెహర్ చెప్పుకొచ్చాడు.
పవన్ ను ఇమిటేట్ చేయాలనే ఐడియా చెప్పిన వెంటనే చిరంజీవి తెగ సంబర పడ్డారట. అంతేకాదు… దాదాపు 700 మంది జనం మధ్య, ఫస్ట్ డే షూటింగ్ లో ముందుగా షూట్ చేసింది పవన్ మేనరిజమ్ సన్నివేశాలేనంట. ఆ సీన్స్ తీస్తున్నప్పుడు చిరంజీవితో పాటు యూనిట్ అంతా ఎంత ఎంజాయ్ చేసిందో.. అంతకు రెండింతలు థియేటర్లలో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నాడు.
ఇక భోళాశంకర్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత చిరంజీవికి చూపించినప్పుడు తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను కూడా బయటపెట్టాడు మెహర్. ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేసి ప్రిన్సిపాల్ ముందు ఎలా నిల్చుంటామో.. అలా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత చిరంజీవి ముందు నిల్చున్నానని గుర్తు చేసుకున్నాడు.
భోళాశంకర్ ఫస్ట్ కాపీ చూసి చిరంజీవి చాలా హ్యాపీ ఫీలయ్యారంట. ఫస్టాఫ్ పూర్తయిన వెంటనే 'మనం కొట్టేశాంరా' అంటూ మెహర్ భుజం తట్టారంట. పక్కనే ఉన్న అనీల్ సుంకరతో కూడా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్నారంట. ఆ ఆనందంలో చిరంజీవి కాళ్లకు దండం పెట్టాడంట మెహర్.
భోళాశంకర్ ఫస్టాఫ్ చిరంజీవికి బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు మెహర్. అయితే చిరంజీవి భార్య సురేఖకు మాత్రం సినిమా మొత్తం నచ్చిందంట. మరీ ముఖ్యంగా సినిమాలో సెంటిమెంట్ సీన్లు ఆమెకు బాగా నచ్చాయంట.