భోళా కష్టాలు.. ఇటు ఓ సమస్య, అటు మరో సమస్య

పక్కాగా అనుకున్న టైమ్ కు షూట్ ముగించారు. అనుకున్న విధంగానే ప్రమోషన్ చేశారు. అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే కాపీ కూడా రెడీ చేశారు. ఇలా అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుందనుకున్న…

పక్కాగా అనుకున్న టైమ్ కు షూట్ ముగించారు. అనుకున్న విధంగానే ప్రమోషన్ చేశారు. అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే కాపీ కూడా రెడీ చేశారు. ఇలా అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుందనుకున్న టైమ్ లో, ఊహించని విధంగా 2 అడ్డంకులు ఎదురయ్యాయి. అవి కూడా ఆషామాషీ అడ్డంకులు కావు. కాస్త గట్టిగా దృష్టి పెట్టాల్సిన సమస్యలు. ప్రస్తుతం ఈ రెండు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు భోళాశంకర్.

గంటల వ్యవథిలో భోళాశంకర్ ను 2 సమస్యలు చుట్టుముట్టాయి. వీటిలో ఒకటి ఊహించినదే, ఇంకోటి మాత్రం అస్సలు ఊహించనిది. ఈ సినిమా నిర్మాత అనీల్ సుంకరకు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కు మధ్య 'ఏజెంట్' వ్యవహారం చాన్నాళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. భోళాశంకర్ టైమ్ కు ఆ వివాదం కొలిక్కి వస్తే సరి, లేదంటే కచ్చితంగా వ్యవహారం రచ్చకెక్కుతుందని ఈ మేటర్ తెలిసిన చాలామంది ఊహించారు.

అంతా ఊహించినట్టుగానే సతీష్, మీడియా ముందుకొచ్చారు. అనీల్ సుంకర తనను మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు భోళాశంకర్ సినిమాను లింక్ చేస్తూ, ఆయన కోర్టుకెక్కారు. ఏజెంట్ సినిమా టైమ్ లో 30 కోట్లు తీసుకొని తనను మోసం చేశారని, ఏ ఒక్క అగ్రిమెంట్ కు కట్టుబడి ఉండలేదని ఆయన ఆరోపిస్తున్నారు.

ఇక భోళాశంకర్ కు ఊహించని సమస్య ఇంకోటి ఎదురైంది. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు సాధ్యమౌతుందా, అవ్వదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతలు తమను సంప్రదించిన మాట వాస్తవమేనని తెలిపిన ప్రభుత్వ వర్గాలు, అప్లికేషన్ అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు సమర్పించలేదని అంటున్నారు.

ఇక్కడ కూడా భోళాశంకర్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి కారణం తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు. కావాలనే మాట్లాడారా, లేక ఫ్లోలో అలా అనేశారో తెలియదు కానీ, చిరంజీవి మాత్రం లాంగ్ గ్యాప్ తర్వాత పాలిటిక్స్ టక్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఉచిత సలహాలిచ్చారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయడం ఏంటి, ఇండస్ట్రీపై పడితే ఉపయోగం ఏంటంటూ కాస్త ఘాటుగా స్పందించారు.

చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అమర్నాధ్.. ఇలా చాలామంది స్పందించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఈ నేపథ్యంలో, భోళాశంకర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా రాదా అనేది అనుమానాస్పదంగా మారింది.

ఇలా ఈ సినిమాను ఒకేసారి రెండు సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.