బీచ్ వీల్ చైర్…వారి కోసం అందమైన ప్రాజెక్ట్

ఈ లోకంలో దేవుడి దయ లేని వారున్నారు. వారే దివ్యాంగులు. అందరిలాగానే వారు కూడా ఈ భూమి మీద పుట్టినా మిగిలిన వారితో సమానంగా అన్ని సదుపాయాలను అందుకోలేకపోతున్నారు. అలాంటి దివ్యాంగుల కోసం మహా…

ఈ లోకంలో దేవుడి దయ లేని వారున్నారు. వారే దివ్యాంగులు. అందరిలాగానే వారు కూడా ఈ భూమి మీద పుట్టినా మిగిలిన వారితో సమానంగా అన్ని సదుపాయాలను అందుకోలేకపోతున్నారు. అలాంటి దివ్యాంగుల కోసం మహా విశాఖ నగర పాలక సంస్థ బీచ్ వీల్ చైర్ పేరిట ఒక భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతోంది.

కోటి రూపాయల వ్యయంతో చేపట్టే ఈ అరుదైన ప్రాజెక్ట్ ని విశాఖ బీచ్ లో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల దివ్యాంగులు కూడా మిగిలిన వారితో సమానంగా వీల్ చైర్ లో ఎంచక్కా కూర్చుని సముద్రం దగ్గర దాకా వెళ్ళి ఆ అనుభూతులను ఆస్వాదించగలుగుతారు.

బీచ్ వీల్ చైర్ కోసం విశాఖలో ఎంపిక చేసిన రుషికొండ, అప్పూఘర్, సాగర్ నగర్ ప్రాంతాలలో ర్యాంపులను నిర్మిస్తారు. దాంతో చాలా సులువుగా దివ్యాంగులు వీల్ చైర్స్ లో బీచ్ లో తిరిగేందుకు వీలు పడుతుంది. అక్కడే వారికి అవసరమైన ఆహారసదుపాయలను కూడా బీచ్ వద్దనే సమకూరుస్తారు.

వారి కోసం సహయాకులను కూడా నియ‌మించనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ విశాఖ కమిషనర్ లక్షీషాకు తట్టిన వినూత్న ఆలోచన. చెన్నై బీచ్ లో ఇలాంటి ప్రాజెక్ట్ ఉండడాన్ని చూసి ఆయన విశాఖలో దాన్ని చేపట్టాలనుకున్నారు. స్మార్ట్ సిటీ నిధులతో రూపుదిద్దుకోకున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్ 2 న ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేళ దివ్యాంగులకు అంకితం ఇస్తూ ప్రారంభం కానుంది.