పేద, మధ్యతరగతి మందు ప్రియులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. వారు కొనుగోలు చేసే చీప్ లిక్కర్ బ్రాండ్ల కొనుగోళ్లపై “ఛీప్” ఆదేశాలు జారీ అయ్యాయి. చీప్ లిక్కర్ కొనుగోలు చేయడానికి దుకాణాలకు వెళ్లిన మందుబాబులకు నిరాశ ఎదురవుతోంది.
చీప్ లిక్కర్ బ్రాండ్లు (రూ.120, రూ.130) రోజుకు కేవలం నాలుగు కేసులు మాత్రమే అమ్మాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) మౌఖిక ఆదేశాలను గురువారం జారీ చేసింది. అంటే రోజుకు 192 చీప్ లిక్కర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలి.
అది కూడా రూ.120 లేదా రూ.130 రేట్లు ఉన్న వాటిలో ఏదో ఒకటి మాత్రమే విక్రయించాలనేది అధికారుల ఆదేశాల సారాంశం. అయితే రోజుమాదిరే మద్యం కొనుగోలుకు వెళ్లిన కస్టమర్లకు దుకాణ విక్రేతలు షాక్ ఇస్తున్నారు. దుకాణంలో చీప్ లిక్కర్ ఉన్నప్పటికీ పరిమితి మించి అమ్మకూడదని చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు ఒక కేసు, 2 గంటల్లోపు మరో కేసు, సాయంత్రం 6 గంటలకల్లా మరో రెండు కేసులు అమ్మాలనే ఆదేశాలు వచ్చినట్టు దుకాణ విక్రేతలు చెబుతూ, ఉత్తచేతులతో పంపుతున్న పరిస్థితి.
అయితే ఈ ఆదేశాల వెనుక భారీ అవినీతి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీప్ లిక్కర్ మద్యం విక్రయాన్ని కట్టడి చేయడం ద్వారా, కాస్ట్లీ మద్యం విక్రయం కొనుగోలు చేయక తప్పని సరి పరిస్థితి. ప్రీమియం బ్రాండ్ల మద్యం కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు ఒప్పందం చేసుకోవడం వల్లే చీప్ లిక్కర్ విక్రయాలను తగ్గించేలా కుట్ర జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చీప్ లిక్కర్ అమ్మకాల వల్లే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది.
తాజాగా వాటి విక్రయాలపైనే కన్నేయడం విమర్శలకు దారి తీస్తోంది. కొందరి వ్యక్తిగత లబ్ధి కోసం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే వాదనకు తెరలేచింది. కనీసం ఏ మందు కొనుగోలు చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి.