ఇటీవల కురిసిన వర్షాలు, పోటెత్తిన గోదావరి, భద్రాచలం జలమయం తదితర అంశాలు రాష్ట్ర విభజనపై చర్చకు దారి తీశాయి. పోలవరం ఎత్తు పెంచడం వల్లే భద్రాచలం జలమయమైందనే వాదనను టీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తోంది.
ఇది కాస్త తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతారా? అనే ప్రశ్నకు తెరలేపింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పోలవరం వివాదంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, దాని గురించి ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు గురించి ప్రశ్నించడమే అని అన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్టే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం ఆలయాన్ని, మరో రెండు మండలాలు తెలంగాణకు కేటాయించారన్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట అనేది సరికాదని సోమువీర్రాజు అన్నారు.
టీఆర్ఎస్ అనవసరంగా పోలవరం అంశాన్ని ప్రస్తావించి, మళ్లీ పాత గాయాలను గెలికేలా చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఏదో అనుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, తిరిగి అవి తమకే రివర్స్ అయ్యే పరిస్థితిని టీఆర్ఎస్ కొని తెచ్చుకుంటోందని చెప్పొచ్చు.