తనను రాజకీయంగా ఆదరించలేదనే కారణంతో సొంత గడ్డ రాయలసీమపై చంద్రబాబునాయుడు విషం చిమ్ముతూనే ఉన్నారు. సీమ అంటే గూండాలు, ఖూనీకోరులున్న ప్రాంతం అన్నట్టు చంద్రబాబు చిత్రీకరిస్తూనే వున్నారు.
ఇవాళ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన అన్యాయంగా రాయలసీమపై నోరు పారేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి ఎన్టీఆర్ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
రాయలసీమ ప్యాక్షన్ రాజకీయాలను ఉభయగోదావరి జిల్లాల్లో చేస్తే స్థానిక నాయకులు వడ్డీతో సహా చెల్లించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాయలసీమలో ప్యాక్షన్ ఒకప్పటి మాట. ఇప్పుడు ప్యాక్షన్ హత్యలనే మాటే లేదు. అక్కడి పిల్లలు బాగా చదువుకుని దేశవిదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా సాగునీటి సౌకర్యం వుంటే రాయలసీమ రూపురేఖలే మారుతాయి. కానీ చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సీమ సాగునీటికి నోచుకోలేదు.
సుదీర్ఘ కాలంపాటు ఏపీని పరిపాలించిన ఘనత తనదని చెప్పుకునే చంద్రబాబు సీమలో ప్యాక్షన్ అంటూ మాట్లాడ్డానికి సిగ్గు లేదా? అని ఆ ప్రాంత ప్రజానీకం మండిపడుతోంది. తన ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోక లేక, రాయలసీమ ప్రాంతాన్ని అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని అనుకోవడం చంద్రబాబుకే చెల్లిందని సీమ ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీమలో ప్యాక్షన్ వుంటే, సీఎంగా దాన్ని అంతమొందించేందుకు ఏం చేశారో చెప్పాలని సీమ విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీమపై సాంస్కృతికంగా దాడి చేస్తూ, ఇతర ప్రాంతాల్లో భయాన్ని కలిగించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే చిల్లర చేష్టలకు స్వస్తి చెప్పాలని సీమ ప్రజానీకం డిమాండ్ చేస్తోంది.
సీమపై పదేపదే బురదచల్లుతున్నా, చంద్రబాబును ఇంకా భరించడం అంటే, ఆ ప్రాంత ప్రజలకు చాలా ఓపిక అనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.