ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన రోజొకటి వస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అసలు ఊహించి వుండరు.
దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఘన చరిత్ర కాంగ్రెస్. ఆ పార్టీకి అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో గురువారం ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆమెను ఈడీ విచారించింది.
ఇటీవల ఇదే కేసులో సోనియా తనయుడు రాహుల్‌గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రాహుల్ ఈడీ విచారణ ఎదుర్కొనే సమయంలో సోనియాగాంధీ అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో ఉన్నారు. కోలుకున్న తర్వాత ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఈడీ విచారణకు కుమార్తె ప్రియాంకతో కలిసి ఆమె వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాకు సహాయంగా ఉండేందుకు ప్రియాంకను ఈడీ అనుమతించింది. మళ్లీ సోమవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఒకప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలో వుంటూ ఓ వెలుగు వెలిగే రోజుల్లో అనేక మందిపై సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పింది. కొందర్ని జైలుపాలు చేసింది. ప్రస్తుత కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాపై కూడా ఓ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరిపింది. నెలల తరబడి జైల్లో పెట్టింది. గుజరాత్ రాష్ట్ర బహిష్కరణ చేసింది.
అలాగే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీబీఐ, ఈడీ దర్యాప్తు తెలిసిందే. అవి నమోదు చేసిన కేసుల్లోనే జగన్ ఇరుక్కుని నానా తంటాలు పడుతున్నారు. అదే సోనియాపై జగన్ అక్కసుకు కారణం.
కాంగ్రెస్‌ను విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్‌కు ఉనికి లేకుండా చేయాలనే తాపత్రయంలో చివరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీని సర్వనాశనం చేసుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పుణ్యమా అని రాజకీయ ప్రముఖులు జైలు పాలయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి సోనియా, రాహుల్‌గాంధీలకు వచ్చింది. తప్పొప్పుల సంగతి పక్కన పెడితే… తాము ఏం చేస్తే అదే వెంటాడుతుందనేందుకు ఇదే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.