మోడీ చేతిలో మహా కత్తెర.. ఇక అన్నీ కటింగులే!

రాజకీయాలలో 'మిఠాయి సంస్కృతి' పోవాలని మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెలవిచ్చారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని ఆయన అభిలషించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్న ఉచిత…

రాజకీయాలలో 'మిఠాయి సంస్కృతి' పోవాలని మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెలవిచ్చారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని ఆయన అభిలషించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్న ఉచిత పథకాల వలన సమాజం.. స్థూలంగా గమనించినప్పుడు, దెబ్బతింటుందని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు! ఈ మాటలన్నీ కూడా.. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం కల్పించే వెసులుబాటులన్నింటికీ కోత పెట్టడానికి ఉద్దేశించిన వ్యూహం అని స్పష్టంగా కనిపిస్తోంది. 

రానున్న రోజుల్లో అపర కుబేరులకు, బడా బాబులకు, ఘనమైన పారిశ్రామికవేత్తలకు మినహా.. దేశంలోని సామాన్యులు, గతి లేని వారు ఎవరికీ ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఉండబోవని అర్థమవుతుంది! మోడీ మార్కు సంక్షేమం.. సంపన్నులను మాత్రమే కాదు, దేశంలోని యావత్ పేద ప్రజలను కూడా “మీ చావు మీరు చావండి” అని గాలికి వదిలేసే బాపతుగానే అనిపిస్తుంది! “ప్రభుత్వానికి పన్నులు భారీగా కట్టండి.. ప్రభుత్వపరంగా సున్నా రాయితీలను పొందండి” అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వపు నవీన రాజనీతిగా, నవ్య నినాదంగా కనిపిస్తోంది.

మిఠాయి పథకాలకు స్వస్తి చెప్పాలని తాను పిలుపు ఇచ్చిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎగబడి దాన్ని ఆచరించేస్తాయని ప్రధాని మోడీ పెద్దగా అనుకోకపోవచ్చు! కనీసం బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా.. అనుచితమైన రీతిలో కొనసాగుతున్న ఉచిత పథకాలకు హఠాత్తుగా స్వస్తి చెప్పడం అనేది ఊహించలేని విషయం! అందుకే కాబోలు, ఉచితాలను తొలగించడానికి రాయితీలను పూర్తిగా పరిహరించడానికి మోడీ స్వయంగా తానే శ్రీకారం చుట్టుతున్నారు! 

కేంద్ర ప్రభుత్వం తరఫున.. దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకు నేరుగా అందే ఉచితాలు, రాయితీలు చాలా స్వల్పంగా ఉంటాయి. వాటిని కూడా కోస్తున్నారు. వయోవృద్ధులకు రైళ్లలో టికెట్ ధరపై కల్పించే రాయితీని పూర్తిగా తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ముందు ముందు కూడా రైళ్లలో వృద్ధులకు ప్రయాణ టికెట్ రాయితీని పునరుద్ధరించే ఉద్దేశం తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

నిజానికి ఇలాంటి రాయితీ ఎత్తివేత అనే ఆలోచనను కోవిడ్ పుణ్యమా అని మొదలుపెట్టారు. కోవిడ్ సీజన్లో రైళ్ళను పునరుద్ధరించిన తర్వాత, వృద్ధుల ప్రయాణాలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో టికెట్ ధర రాయితీని తొలుత ఎత్తివేశారు. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కూడా ఈ రాయితీని పునరుద్ధరించలేదు. తాజాగా ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు, ముందు ముందు కూడా వృద్ధులకు ఇచ్చే టికెట్టు రాయితీని పునరుద్ధరించబోయేది లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. నిజానికి కేంద్రం వేయగలిగిన ఇలాంటి కత్తెరల గురించి మనం ముందుగానే అర్థం చేసుకొని ఉండాల్సింది.

కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందని సామెత! ఆ రకంగా ఉచిత పథకాల విషయంలో మోడీ ప్రభుత్వం ధోరణి, పోకడ ఎలా ఉండబోతున్నది అనే సంగతి.. వారు తొలిసారి గద్దె ఎక్కినప్పుడే చూచాయగా అర్థమైంది! దేశ ప్రజలందరికీ కామన్ గా.. కేంద్రం నుంచి అందే ఏకైక రాయితీ.. వంటగ్యాస్ ధరలో వెసులుబాటు! స్వల్పంగానే ఉండే ఈ వంట గ్యాస్ రాయితీని దారుణంగా కోస్తూ వచ్చి చివరికి ఉందా లేనట్లుగా అన్నట్టుగా తయారు చేశారు! ఇప్పుడు రైల్వే టికెట్ రాయితీని కూడా ఎత్తివేశారు. 

కేంద్రం నుంచి ప్రజలకు రాగలిగిన ఏ రాయితీ కూడా ముందు ముందు ఉండబోదు. తర్వాతి దశలో కేంద్రం అడుగుజాడల్లోనే నడుస్తున్నాం అంటూ బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఇదే పని చేయడం ప్రారంభిస్తాయి. ఇతర రాష్ట్రాలు పైకి విమర్శించినా ప్రభుత్వంపై భారం తగ్గుతుంది కనుక అనుసరిస్తాయి.

ఒకరకంగా ఇది మంచిదే అనిపిస్తుంది. కానీ 150 కోట్ల జనాభా.. కులాలు మతాలు ప్రాంతాల రూపేణా అనేకానేక అసమానతలు ఉండే మన దేశంలో.. ప్రభుత్వాలు కొంచం చేయూత.. సమసమాజాన్ని స్థాపించడం గానీ, సమాన అభివృద్ధిని సాధించడం గానీ, సరైన పాలన అందించడం గానీ చేయగలవా అనేది అనుమానమే.