ఏపీలో ఎన్నికల వేడి ఎంతో ముందుగానే మొదలైంది. చేరికలు, తీసివేతలపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ దఫా మెజార్టీ స్థానాలు సాధించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే అది తన సొంత జిల్లా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో 14 స్థానాల్లో కేవలం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే టీడీపీ గెలుపొందింది. అది కూడా చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో మాత్రమే టీడీపీ గెలిచింది.
ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న పరిస్థితుల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబును పార్టీలోకి తీసుకోడానికి చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారని తెలిసింది. అయితే సీకే బాబును తీసుకునేందుకు టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారని తెలిసింది.
ముఖ్యంగా పులివర్తి నాని, చిత్తూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కానీ సీకే బాబు రాకతో వైసీపీని దీటుగా ఢీకొట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సీకేని తీసుకోడానికే చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. సీకే బాబు టీడీపీలోకి వస్తే… తమ రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే ఆందోళన ఆ పార్టీకి చెందిన కొందరి నేతల్లో కనిపిస్తోంది.
గతంలో సీకే బాబు అరాచకాలపై స్వయంగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు అలాంటి నాయకుడిని తీసుకుంటే నెగెటివ్ సంకేతాలు వెళ్తాయనే వాదనను టీడీపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ రాజకీయంగా సీకే బాబు అవసరం పార్టీకి ఉన్నట్టు చంద్రబాబు మాత్రం బలంగా నమ్ముతున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి మరి!