చంద్రబాబునాయుడు గారు మహా జ్ఞాని. ఆయనకు తెలిని సంగతులు ఉండవు. ఆయన వ్యాఖ్యానించలేని సంగతులూ ఉండవు. ఏ టాపిక్ గురించి అయినా.. తనకు ఏమీ తెలియకపోయినా సరే.. ఆయన అమూల్యమైన అభిప్రాయం వెల్లడించగలరు. ఇప్పుడాయన ఏపీకి-శ్రీలంకకు ముడిపెట్టి తన అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆల్రెడీ ఏపీలో శ్రీలంక పరిస్థితులు వచ్చేశాయని అంటున్నారు.
ఇంతకూ అసలు శ్రీలంక పరిస్థితులు అంటే ఏమిటో? ఏరకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీలంకకు ముడిపెట్టవచ్చునో మహాజ్ఞాని అయిన చంద్రబాబుకు మాత్రమే తెలుస్తుంది. చంద్రబాబునాయుడుగారి వ్యవహారం మోకాలికీ బోడిగుండుకీ ముడిపెడుతున్న చందంగా కనిపిస్తోంది.
ఇంతకూ చంద్రబాబునాయుడు చెబుతున్న పరిస్థితులు ఏమిటో తెలుసా? ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదట. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదట. ఈ చిల్లర సంగతులు చెప్పి.. శ్రీలంకతో పోల్చేస్తే ప్రజలను జగన్ ప్రభుత్వం గురించి భయటపెట్టవచ్చునని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఉద్యోగులకు జీతాలు.. కొన్ని రోజుల వ్యవధి తేడాతో అయినా సరే.. ప్రతినెలా చెల్లిస్తేనే ఉన్నప్పుడు.. దానిని ఆర్థిక దుస్థితి కింద ఎలా అభివర్ణించగలరు. జీతాలు ఆలస్యం కావడం వలన ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండవని అనలేము. కానీ, అవన్నీ తాత్కాలికమే కదా. సర్దుకోగల ఏర్పాటుకు తగినవే కదా.. అనేది పలువురి వాదన. జీతాలు కొన్ని నెలల పాటూ ఇవ్వలేని పరిస్థితి ఎన్నడైనా దాపురిస్తే.. అప్పుడు.. ఈ ప్రభుత్వం పాలనలో ఆర్థిక పరిస్థితులు చేయిజారిపోతున్నాయని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ.. చాలా చిన్న విషయాన్ని.. తిమ్మిని బమ్మిని చేసి.. భూతద్దంలో చూపించి.. శ్రీలంక పరిస్థితులు అని ప్రజల్ని భయపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
అదే రీతిగా.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే వ్యవహారం కూడా. రాష్ట్రంలో పనులు జరుగుతూనే ఉన్నాయి. బిల్లులు ఆలస్యం అయ్యే సందర్భాలు కొన్ని ఉండవచ్చు. కానీ.. తెలుగుదేశం మొగ్గు ఉండే వారితో బిల్లులు చెల్లించడం లేదని యాగీ చేయించి.. ఆ మాటల్ని భూతద్దంలో చూపిస్తూ.. పరిస్థితి దిగజారిందంటే ఎలాగ? ఏ పనికీ బిల్లులు చెల్లించకపోతే.. రాష్ట్రంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిర్మాణ పనులు ఇప్పటికీ ఎలా జరుగుతున్నాయి అనేది ప్రశ్న!
చంద్రబాబునాయుడు.. తాను హామీ ఇచ్చిన రైతు రుణమాఫీనే సకాలంలో చెల్లించలేదు. విడతలుగా అని మాయచేసి.. ఆ మొత్తం కూడా పూర్తిగా చెల్లించకుండానే పదవి దిగిపోయాడు. అలాగే తన హయాంలో పూర్తయిన పనులకు సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్లారు. అంటే.. ఆయన చెబుతున్న నిర్వచనం ప్రకారం.. ఏపీలో శ్రీలంక పరిస్థితులు అనేవి.. తెలుగుదేశం పాలన కాలంలోనే మొదలయ్యాయని అనుకోవాలా?
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడమే శ్రీలంక పరిస్థితి అయితే గనుక.. ఏపీకి సంబంధించినంత వరకు ఆ దుస్థితికి శ్రీకారం చుట్టిన వాడు, ఆద్యుడు చంద్రబాబునాయుడే..! జగన్ పాలన గురించి నోరు జారే ముందు.. బురద చల్లేముందు, ప్రజలను భయపెట్టడానికి కుట్ర చేసేముందు.. ఆయన ఈ వాస్తవాన్ని గ్రహిస్తే బాగుంటుంది.