శివసేన పార్టీ చీలిక వర్గం అని మాత్రమే ఇప్పటిదాకా ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అందరూ వ్యవహరిస్తున్నారు. బాల్ ఠాక్రే కుమారుడు గనుక.. శివసేన అనేది ఉద్ధవ్ ప్రాపర్టీ అనే ఉద్దేశంతో చూస్తున్న వారు ఇంకా ఉన్నారు. అయితే.. ఈ పరిస్థితులు మారబోతున్నాయా? అంటే నిజమే. అసలైన శివసేన అనేది..ఏక్‌నాథ్ షిండే చేతుల్లో ఉన్నదే.. అని అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. లీగల్ గా హక్కులు సంక్రమించే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి శివసేన పార్టీ ‘విల్లు-బాణం’ ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని షిండే వర్గం ఈసీకి లేఖ రాయడం కూడా జరిగింది. ఈ విషయం త్వరలోనే ఒక కొలిక్కి రావొచ్చు.
షిండే తిరుగుబాటు తర్వాత కూడా.. మహారాష్ట్రలో ఏర్పడింది శివసేన ప్రభుత్వమే అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ.. ఉద్ధవ్ ఎటూ శివసేన తనదే అని అంటూనే ఉన్నారు. పార్టీ చీలిపోకుండా ఆయన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చారనే అనుకోవచ్చు. ఎందుకంటే.. ద్రౌపది ముర్ముకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఆయన ప్రకటించినా, ప్రకటించకపోయినా.. ద్రౌపదికి వచ్చిన నష్టం లేదు. ఆమె ఎటూ గెలుస్తారు. చీలిక వర్గం మొత్తం ఆమెకు ఓటు వేస్తారు. అయితే.. చీలిక వర్గం ఒక రకంగా, తానొక రకంగా వ్యవహరిస్తే.. ఇంకా జరగగల నష్టాన్ని నివారించుకోవడానికి ఉద్ధవ్ ద్రౌపదికే జై కొట్టారు.
అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయానికి వచ్చేసరికి తేడా వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికకు తీసుకున్న నిర్ణయం వల్ల మహా వికాస్ ఆఘాడీ లో వచ్చిన అసంతృప్తులు లుకలుకల నేపథ్యంలో.. ఉద్ధవ్ జాగ్రత్తగా వ్యవహరించారు. కాంగ్రెస్ బలపరచిన ఆళ్వాకే మద్దతిచ్చారు. అయితే.. ఆ నిర్ణయం మొదలుగా.. శివసేన చీలిక మరింత ఘోరంగా మారింది. అప్పటిదాకా ఎంపీల్లో చీలిక ప్రభావం తక్కువ కనిపించింది. ఆళ్వాకు మద్దతు తర్వాత.. ఎంపీలు కూడా చీలిపోయారు. మెజారిటీ ఎంపీలు.. షిండే వర్గంలో చేరారు.
ఇప్పుడు షిండే పార్టీ ఎన్నికల గుర్తును తమ వర్గానికి కేటాయించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. త్వరలోనే అది వారికి దక్కడం లాంఛనం అవుతుంది. ఆ తర్వాత శివసేన పార్టీకి అధికారికంగా ఉన్న ఆస్తులు, భవనాల గురించి కూడా రచ్చ మొదలవుతుంది. వాటిగురించి న్యాయపోరాటం జరుగుతుంది. మాదంటే మాదే ఆస్తులన్నీ కూడా అని వాదించుకుంటారు. చివరికి షిండేవర్గం నెగ్గుతుంది. ఏతావతా.. పార్టీలో పుట్టిన ముసలం విజృంభించి.. శివసేన పెద్ద ముక్క, చిన్న ముక్క తయారవుతాయి.
అచ్చంగా.. ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచి మెజారిటీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు తొలుత పార్టీ గుర్తును, తర్వాత పార్టీ ఆస్తులను సమస్తంగా దక్కించుకున్న వైనం గుర్తుకు వస్తోందా? మనం ఏమీ చేయలేం.