పుణ్యక్షేత్రాలకు నిలయం రాయలసీమ. అనునిత్యం దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున భక్తులు సీమలోని ఆలయాల సందర్శనకు వరదలా వస్తూనే ఉంటారు. తిరుమల వైభవం గురించి వివరించనక్కర్లేదు. అంతే కాదు.. రాయలసీమలో వేసవి కాలంలో దేవుళ్ల దర్శనం మరింత ఎక్కువ. శ్రీశైలం ఆలయానికి ఈ సమయంలోనే భక్తులు వెల్లువలా వస్తారు. కర్ణాటక నుంచి ఈ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు నడుచుకుంటూ వస్తారు. ప్రత్యేకించి హైదరాబాద్ కర్ణాటక పరిధి నుంచి శ్రీశైలానికి కాలినడకన వచ్చే భక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీశైలం ఈ సమయంలో సాధారణంగా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే కరోనా భయాల నేపథ్యంలో ఆ పరిస్థితి లేనట్టే.
ఇక తిరుమల శ్రీవారి ఆలయం మూత కొనసాగుతూ ఉంది. స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతున్నా భక్తులకు మాత్రం ప్రవేశం లేదు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ పరిస్థితి కొనసాగబోతోంది. ఇక ఒంటిమిట్టలో శ్రీరామవనమి సంప్రదాయబద్ధంగా జరిగింది. అయితే భక్తులకు ప్రవేశం మాత్రం పూర్తి స్థాయిలో లేదు. ధర్మకర్తల ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి.
ఇక రాయలసీమలో వేసవి అంటే.. అనేక రకాల జాతరల సమయం. అమ్మవార్లకు, పోతలయ్యలకు చాలా ఊర్లలో మొక్కులు చెల్లించుకోవడం, జంతుబలులు కొనసాగుతూ ఉంటాయి. ప్రతియేటా ఇలాంటి కార్యక్రమాలు జరిగే పల్లెలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అలాంటి వాటి ముచ్చట కూడా లేదు. కరోనా భయాల నేపథ్యంలో దేవుడికి మొక్కులు, దర్శనానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఇవి.