మొదటిసారి కరోనా వచ్చినప్పుడు దీపాలు వెలిగించారు. గంటలు కొట్టారు. ప్రయోజనం దక్కలేదు. కొన్ని నెలలకు కరోనా పోయిందనుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. సెకెండ్ వేవ్ వచ్చింది. దానికి కూడా కేంద్రం సన్నద్ధంగా లేదు. ఓవైపు సెకెండ్ వేవ్ వస్తుందని తెలిసి కూడా స్వదేశంలో తయారైన టీకాల్ని విదేశాలకు తరలించింది.
ఈ రెండు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మూడో వేవ్ పై కాస్త ముందుగానే అప్రమత్తమైనట్టుంది కేంద్రం. మరీ ముఖ్యంగా థర్డ్ వేవ్ లో కరోనా చిన్నారుల్ని పట్టి పీడిస్తుందనే అంచనాల మధ్య, పిల్లలకు కరోనా ట్రీట్ మెంట్ కు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. కరోనా సోకిన పిల్లలకు రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అంతేకాదు.. కరోనా నిర్థారణకు సంబంధించి చేసే సిటీ స్కాన్ విషయంలో కూడా పరిమితులు విధించింది. ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే చిన్నారులకు సిటీ స్కాన్ సిఫార్స్ చేయాలని వైద్యులకు సూచించింది.
ఇక కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడకానికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ విడుదల చేసింది. చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని నిర్థారించుకున్న తర్వాతే యాంటీబయాటిక్స్ ఇవ్వాలని, ఇక వైరస్ తీవ్రత అస్సలు లేకపోయినా, మధ్యస్థంగా ఉన్నా స్టెరాయిడ్స్ ఇవ్వొద్దని సూచించింది. ఒకవేళ వైరస్ ముదిరితే మాత్రం ప్రత్యక్ష పర్యవేక్షణలో వైద్యులు పిల్లలకు స్టెరాయిడ్స్ ఇవ్వాలని సూచించింది.
దేశంలో చిన్న పిల్లల వైద్యులు సరిపడినంత మంది లేరు. చిల్డ్రన్స్ హాస్పిటల్స్ కూడా తక్కువే. పైగా కరోనా సోకిన పిల్లలందర్నీ హోమ్ ఐసొలేషన్ లో పెట్టడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల హాస్పిటల్స్, వైద్యులపై పెనుభారం పడే ప్రమాదముందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. ఓవైపు థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ పిల్లలపై దాడిచేస్తున్నందనడానికి సరైన ఆధారాల్లేవని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నప్పటికీ.. భయాలు మాత్రం తొలిగిపోలేదు.