కొన్నేళ్ల కిందటి సంగతి. అల్లు అర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాధమ్ సినిమా తీశాడు హరీష్ శంకర్. అప్పట్లో ఆ సినిమా కలెక్షన్లపై ఓ రేంజ్ లో రచ్చ నడిచింది. మహేష్, పవన్ కల్యాణ్ సినిమాల్ని కూడా క్రాస్ చేసినట్టు లెక్కలు చూపించారు. మరీ ముఖ్యంగా మొదటి రోజు వసూళ్లు, మొదటి వారాంతం వసూళ్లలో లెక్కలు తారుమారు చేశారనేది వాస్తవం.
దీనిపై అప్పట్లో హరీష్ శంకర్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. దాన్ని భరించలేక సదరు దర్శకుడు అప్పట్లో చాలామందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు. వాళ్లలో మహేష్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువమంది. ఇప్పుడీ దర్శకుడు మరోసారి అదే ''డీజే పద్ధతిని'' ఫాలో అవుతున్నాడు.
త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ దర్శకుడు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే మూవీకి సంబంధించి అప్ డేట్స్ రాకపోవడంతో, కొంతమంది పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో తామే పోస్టర్లు క్రియేట్ చేయడం, ఫేక్ టైటిల్స్ సర్కులేట్ చేయడం స్టార్ట్ చేశారు.
వీటిపై తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టత కూడా ఇచ్చింది. తాము ప్రకటించేవరకు ఏదీ నిజం కాదని, రూమర్స్ నమ్మొద్దని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ తరహా కథనాలు ఆగకపోవడంతో దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో బ్లాకింగ్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
పవన్ ఫ్యాన్స్ కు చెందిన కొంతమంది ట్విట్టర్ ఖాతాల్ని, కొన్ని ఫ్యాన్ పేజీల్ని హరీష్ బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి హరీష్ శంకర్ పై అప్పుడే కొన్ని పేజీల్లో ట్రోలింగ్ కూడా మొదలైంది.