అక్కడ ముగ్గురికి క్యాబినెట్ ర్యాంకులు

రాజు తలచుకుంటే వరాలకు కొదవా అని సామెత ఉంది. అలాగే జగన్ అనుకుంటే కానిదేముంటుంది. జిల్లాల విభజనతో అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్న ఈ జిల్లాలో అన్నింటినీ 2019…

రాజు తలచుకుంటే వరాలకు కొదవా అని సామెత ఉంది. అలాగే జగన్ అనుకుంటే కానిదేముంటుంది. జిల్లాల విభజనతో అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్న ఈ జిల్లాలో అన్నింటినీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇపుడు క్యాబినెట్ ర్యాంక్ హొదా దక్కింది. రాజకీయంగా ఇది విశేషమే అంటున్నారు.

మూడున్నర నెలల క్రితం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అనకాపల్లి జిల్లాకు జగన్ పెద్ద పీట వేశారు. యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కి మంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖకు దక్కాయి. అలాగే మాడుగులకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ప్రాధాన్యత కలిగిన పంచాయతీరాజ్ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది

అయితే రేసులో ఆనాడు కొసవరకూ ఉన్న మరో సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఆశాభంగం ఎదురైంది. దాంతో జగన్ ఇపుడు ఆయనకు సమ న్యాయం చేశారు. క్యాబినెట్ ర్యాంక్ తో మంత్రి హోదాకు సమానంగా ఉండే ప్రభుత్వ విప్ పదవిని ధర్మశ్రీకి తాజాగా కేటాయించి కరణానికి ఆయన అనుచరులకూ ఎనలేని ఆనందం కలిగించారు.

చోడవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మశ్రీకి అనకాపల్లి జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా కూడా ఇప్పటికే  గురుతర బాధ్యతలు అప్పగించారు. దీంతో కొత్త జిల్లాలో ముగ్గురుకి క్యాబినెట్ ర్యాంక్ దక్కినట్లు అయింది. అలాగే బలమైన సామాజికవర్గాలకు పదవులు లభించాయి.