తిరుపతిలో బాలాజీ వికలాంగుల శస్త్ర చికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్) పేరు చెబితే ప్రధానంగా పేదలకు మోకీళ్లు, తుంటి ఎముకలకు ఉచిత శస్త్ర చికిత్స చేయడం గుర్తొచ్చేది. ఇది మూడేళ్ల క్రితం మాటలేండి. ఇప్పుడు అక్కడ బర్డ్ ఆశయానికి పూర్తి భిన్నంగా మోకీళ్లు, తుంటి ఎముకలు విరగ్గొడుతున్నారంటే …ఆశ్చర్యపోతున్నారా? ఔను, ఇది ముమ్మాటికి నిజం. ఈ విమర్శ అక్కడికి వస్తున్న రోగులు, వారి బంధువుల నుంచి ఆవేదనతో వస్తోంది.
కార్పొరేట్ ఆస్పత్రిని తలపించేలా ఆపరేషన్లకు పేదల నుంచి కూడా ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. బిల్లుల రూపంలో పేదల నడ్డి విరుస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. మోకీళ్లు, తుంటి ఎముకల ఆపరేషన్లకు వెళితే … భరించలేని విధంగా బిల్లులు విధిస్తూ రోగి కుటుంబ మొత్తానికి ఏ కీలుకా కీలు కనిపించకుండా విరిచేస్తున్నారనే వ్యంగ్యాస్త్రాలు బర్డ్‌పై విసురుతున్నారు. ఇది ప్రస్తుత పాలనలో బర్డ్ సాధించిన పురోగతి అని చెప్పక తప్పదు.
ఈ ఆస్పత్రి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. చంద్రబాబు హయాంలో ఈ ఆస్పత్రిలో అన్నిటికి ఉచిత ఆపరేషన్లు చేసేవారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కాలం పాత పద్ధతిలోనే వ్యవహారం నడించింది. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ఆస్పత్రి పూర్తిగా కోవిడ్ కేంద్రంగా మారింది. కోవిడ్ నుంచి తేరుకున్న తర్వాత తిరిగి యధావిధిగా ఆపరేషన్లు మొదలయ్యాయి. నెమ్మదిగా ఉచితానికి మంగళం పాడారు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఉచిత ఆపరేషన్లు అన్నట్టుగా బర్డ్‌ను దిగజార్చారు. ఒకప్పుడు నెలలో 200 ఉచిత ఆపరేషన్లు చేస్తే… ప్రస్తుతం 25కు మించలేదంటే నమ్మగలరా? నమ్మశక్యం కాని కఠిన వాస్తవం ఇది. ఆపరేషన్ల కోసం సిఫార్సుల గొడవ ఎప్పుడూ వుండేదే అని సరిపెట్టుకున్నా… తాజాగా అసలుకే ఎసరు పెట్టడంతో తీవ్ర విమర్శలపాలవుతోంది.
రెండు రోజుల క్రితం వరకూ మోకీళ్ల ఆపరేషన్‌కు రూ.65 వేలు తీసుకునే వారు. ఒక్కసారిగా ఆ మొత్తాన్ని రూ.72 వేలకు పెంచడంతో రోగులు, వారి బంధువులు లబోదిబోమంటున్నారు. రూ.65 వేలు కట్టుకోలేమని మొత్తుకుంటుంటే… అదనపు భారం వేయడం ఏంటని నిలదీస్తున్నారు. అంటే బర్డ్‌కు పేద, మధ్య తరగతి రోగులు రావద్దని చెప్పదలుచుకున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రిలో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రోగులకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా అందించే వారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 14న తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. బర్డ్ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మూడు వార్డులను అభివృద్ధి చేసి మరో 100 పడకలు అందుబాటులోకి తేవాలని అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మోకాళ్లు, తుంటి ఎముకల ఆపరేషన్లు నిరుపేదలకు పూర్తి ఉచితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న రోగుల నుంచి ఇంప్లాంట్స్ ఖర్చు తీసుకుని శస్త్ర చికిత్స చేయాలని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
దీంతో బర్డ్‌కు పాతరోజులు వస్తాయని అందరూ సంతోషించారు. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి అనే చందంగా బర్డ్‌లో మోకీళ్ల ఆపరేషన్‌పై ఏకంగా రూ.7 వేలు పెంచారు. ఈ ఆస్పత్రికి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అనే ధర్మప్రభువు ఎండీగా కొనసాగుతున్నారు. తిరుమల వెంకన్నను భక్తులు ఎన్నిసార్లు తలచుకుంటారో తెలియదు. కానీ, బర్డ్‌ను కార్పొరేట్‌గా తీర్చిదిద్దిన ఘనత ఈ ధర్మప్రభువుదే అని రోగులు ఆయన్ని తలచుకోని క్షణం లేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరి తెచ్చుకున్న వాళ్లే… ఆయనకు చెడ్డపేరు తేవడానికి కారణమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బర్డ్‌కు ఒక్కసారి వచ్చిన వాళ్లెవరైనా ప్రభుత్వాన్ని తిట్టుకోకుండా ఇంటికెళ్లరు. పోనీ ఈ తతంగానికి జగన్‌కు ఏమైనా సంబంధమా? అంటే లేనేలేదు. కానీ ఆయన ప్రతినిధుల నిర్ణయాలే ప్రభుత్వానికి, టీటీడీకి అప్రతిష్ట తెచ్చేలా ఉన్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ పెద్దలు సంస్కరించకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.