Advertisement

Advertisement


Home > Politics - Analysis

ప్ర‌శ్నించాల్సిందెవ‌రిని? ప్ర‌శ్నిస్తున్న‌దెవ‌రిని?

ప్ర‌శ్నించాల్సిందెవ‌రిని? ప్ర‌శ్నిస్తున్న‌దెవ‌రిని?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ లోక్‌స‌భ వేదిక‌గా తేల్చిచెప్పింది. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ స్పందిస్తూ.... ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయ‌మ‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇవ్వ‌డం విశేషం.

ప్ర‌త్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌న్నారు. కేంద్రం ప‌న్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం కూడా అదే తరహాలో సిఫార్సులు చేసిందన్నారు. ఆ తర్వాత 41 శాతానికి సర్దుబాటు చేసిందని వెల్లడించారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశామన్నారు.

కొన్ని మాత్ర‌మే పెండింగ్‌లో వున్నాయ‌న్నారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్ర‌ప్ర‌భుత్వ వైఖ‌రిలో ఎలాంటి మార్పు లేదు. ఎవ‌రెన్ని సార్లు అడిగినా ...ముగిసిపోయిన అధ్యాయం అని తేల్చి చెబుతోంది. అయితే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా, పోల‌వ‌రం ప్రాజెక్టుకు త‌గిన నిధులు ఇవ్వ‌క‌పోయినా, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌క‌పోయినా మోదీ స‌ర్కార్‌ను ఏపీకి చెందిన అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌శ్నిస్తున్న దాఖ‌లాలున్నాయా? పైగా మోదీ ప్ర‌భుత్వానికి వెన్నుద‌న్నుగా నిల‌వ‌డానికి తామంటే తామ‌ని వైసీపీ, టీడీపీ పోటీ ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాపై కేంద్రాన్ని నిల‌దీయ‌ని వైఎస్సార్‌సీపీ, టీడీపీల‌ను ప్ర‌శ్నించాలా? లేక త‌న వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాలేద‌ని చెబుతున్న మోదీ స‌ర్కార్‌ను విమ‌ర్శించాలా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకోవ‌డంతో మొద‌టి త‌ప్పు జ‌రిగిపోయింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌తిప‌క్ష పార్టీగా వైసీపీ అనేక ఉద్య‌మాలు చేసి... టీడీపీని దోషిగా నిల‌బెట్టింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ రాజ‌కీయంగా లబ్ధి పొందింది.

త‌మ‌కు 25కు 25 పార్ల‌మెంట్ స్థానాలు ఇస్తే ప్ర‌త్యేక హోదా తీసుకొస్తాన‌ని ప్ర‌తిప‌క్ష నాయకుడిగా వైఎస్ జ‌గ‌న్ న‌మ్మ‌బ‌లికారు. అడిగిన దాని కంటే కేవ‌లం మూడు సీట్లు మాత్ర‌మే త‌క్కువ ఇచ్చి, వైసీపీకి ఘ‌న విజ‌యం అందించారు. అయితే కేంద్రంలో త‌మ అవ‌స‌రం లేకుండానే బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని, ప్ర‌త్యేక హోదాను అడుగుతూ వుంటాన‌ని జ‌గ‌న్ మొద‌ట్లోనే చేతులెత్తేశారు. ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ అవ‌స‌రం ఏర్ప‌డినా... ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌త్యేకంగా అడిగిన దాఖ‌లాలు లేవు.

అలాగే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి అంతే. రాష్ట్రానికి న్యాయం చేయ‌డంలో వైసీపీ, టీడీపీ దొందు దొందే అన్న‌ట్టుగా త‌యారైంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన‌, చేస్తున్న మోదీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌లేని ద‌య‌నీయ స్థితిలో వైసీపీ, టీడీపీ ఉ్నాయి. అందుకే ఏపీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇష్టానుసారం ఆడుకుంటోంది. అన్యాయంపై నిల‌దీయ‌లేని వైసీపీ, టీడీపీల‌ను నిల‌దీయాలా లేక కేంద్ర ప్ర‌భుత్వాన్నా? అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?