పార్లమెంట్‌లో గొడవలు మామూలే కానీ, పార్లమెంట్‌పైన సింహాలపై ఈ మధ్య గొడవ జరుగుతోంది. మన దేశ చిహ్నమైన మూడు సింహాలను పార్లమెంట్ నెత్తి మీద ప్రతిష్టించారు. అయితే అవి ఒరిజనల్ చిహ్నంలో ఉన్నట్టుగా సౌమ్యంగా కాకుండా క్రూరంగా, కోపంగా వున్నాయని విమర్శ.
అది అశోకుడి కాలం కాబట్టి సౌమ్యంగా ఉన్నాయి. ఇది మోదీ కాలం కాబట్టి గర్జిస్తూ వున్నాయి. సాయికుమార్ డైలాగ్ మాదిరి చెప్పాలంటే కనబడని నాలుగో సింహమే మోదీ. బీజేపీ వాళ్ల మాటల్లో చెబితే ఉన్నవి రెండు సింహాలే మోదీ, అమిత్‌షా. మూడో సింహం కేవలం ప్రతీక.
మన భారతీయులకి సింహాల పట్ల భయం, గౌరవం. దేవాలయాలపై అనేక సింహం బొమ్మలు కనిపిస్తాయి. సింహం రూపంలో మనకి నరసింహ అవతారమే వుంది. దేవుళ్లందరికీ సింహ వాహనం ఉత్సవాలుంటాయి. తెలుగు వాళ్లకి సింహం అంటే ఆరాధన. దాని గొప్పదనాన్ని వివరించే ఎన్నో పదాలున్నాయి. సింహస్వప్నం, ఏనుగు కలలోకి సింహం వచ్చినా భయపడుతుందని వాడుక.
సింహాసనం – మహారాజుల కుర్చీ. సింహభాగం – ఎక్కువ వాటాని కోరుకుంటే సింహభాగం. సింహబలుడు – మహాబలవంతుడు, ఈ పేరుతో ఎన్టీఆర్ సినిమా కూడా వుంది.
సినిమా టైటిల్స్‌లో మనకి సింహం పిచ్చి. చాలా ఏళ్ల క్రితం సింహం నవ్వింది అని ఎన్టీఆర్ సినిమా వచ్చింది. ఒక హిందీ సినిమాకి రీమేక్. ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేశాడు. ఆయన నవ్వడం ఏమో కానీ, ప్రేక్షకులు మాత్రం కుయ్యోమొర్రో అన్నారు.
కొండవీటి సింహం ఆల్ టైమ్ హిట్. తమిళ సినిమా బంగారు పతకం ఆధారంగా తీసినా సూపర్‌హిట్. ఏఎన్ఆర్‌కి తన బలం తెలుసు కాబట్టి సింహం జోలికి వెళ్లలేదు. కృష్ణకి తన బలం తెలియదు కాబట్టి సింహం టైటిల్స్ వాడుకున్నాడు. సింహగర్జన (1978). ఇది గిరిబాబు సొంత సినిమా. అడవి సింహాలు (1982). సింహాసనం (1985).
శోభన్‌బాబు భయపడి వదిలేశాడు కానీ, కృష్ణంరాజు మాత్రం ఉగ్రనరసింహం, సింహస్వప్నం, సింహగర్జన అన్నాడు. బాలకృష్ణ ఐదు సినిమాలు తీశాడు. సింహం నవ్వింది, సీమ సింహం, సింహ, లయన్, జైసింహ. చిరంజీవి కొదమసింహం, సింహపురి సింహం తీశాడు.
సినిమాల్లో సింహాలకి కొదవ లేదు కానీ, వాస్తవానికి మన దేశంలో సింహాలు అంతరించిపోతున్నాయి. కాపాడుకోకపోతే కరెన్సీ నోట్ల మీద మాత్రమే మిగులుతాయి.
సింహం విలన్‌గా చిరంజీవి మృగరాజు సినిమా వుంది. చాలా బావుంటుంది కానీ, ఎందుకో జనానికి నచ్చలేదు. సింహాన్ని చిరంజీవి గాల్లోకి విసిరేయాలి కానీ, దాన్ని చంపడానికి రెండు గంటలు ప్లాన్ చేయడం అభిమానులకి బోర్ అనిపించింది.
ఒకప్పుడు సర్కస్‌లో కనిపించేవి. ఇప్పుడు “జూ”లో మాత్రమే చూడాలి. సినిమాల్లో కనిపించేవన్నీ గ్రాఫిక్స్ సింహాలే.
ఇంతకూ వచ్చే ఎన్నికల్లో మోదీ సింహం గర్జిస్తుందా? గ్రాఫిక్స్‌గానే మిగిలిపోతుందా?
జీఆర్ మహర్షి