ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నేరుగా ఉండవల్లి అరుణ్‌కుమార్ మద్దతు ఇవ్వనప్పటికీ, ఆయన శ్రేయోభిలాషిగా ముద్రపడ్డారు. తనకు ఎంతో ఇష్టమైన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జగన్‌ను అభిమానిస్తానని ఎన్నో సందర్భాల్లో సెలవిచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రజాసమస్యలపై ఉండవల్లి బలమైన గళాన్ని వినిపించారు. చంద్రబాబు రాజగురువు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తూ, మీడియా దిగ్గజాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే.
ఎవరేం అనుకున్నా ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయాలకు తెలుగు సమాజంలో గౌరవం ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఉండవల్లి కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాలని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటని చిరు విమర్శపై వైసీపీ తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో చిరంజీవికి ఉండవల్లి అరుణ్‌కుమార్ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. ప్రత్యేక హోదాపై పోరాడాలని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సలహా ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడ్డం ఆషామాషీ కాదన్నారు. నాడు పార్లమెంట్‌లో చిరంజీవి మాట్లాడ్డం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయ్యిందన్నారు.
అయితే చిరంజీవి సినిమా పరిశ్రమను పిచ్చుకగా అభివర్ణించడం సరైందే కానీ, ఆయన మాత్రం కాదని ఉండవల్లి కీలక కామెంట్స్ చేశారు. చాలా సందర్భాల్లో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేలా మాట్లాడే ఉండవల్లి, మెగాస్టార్ కామెంట్స్‌పై అందుకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఉండవల్లి కామెంట్స్‌పై చిరు, పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.